ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాకా ఊదడానికి.. తెలుగుదేశం పార్టీపై పుకార్లు ప్రచారం చేయడానికి ఏ మాత్రం సంకోచించని ఎన్టీవీ… రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేయడానికి కూడా ఇప్పుడు వెనుకాడటం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. తన పదవి కోసం న్యాయపోరాటం చేస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా దుమ్మెత్తిపోసిన ఎన్టీవీ తాజాగా.. మరో అరగంట కథనాన్ని వండి వార్చింది. ఎస్ఈసీపై అనేక రకాల ఆరోపణలు చేస్తూ… ఆయనేదో నిర్ణయం తీసుకోబోతున్నారన్ని దాన్ని అడ్డుకట్ట వేయాల్సిందేనని.. ఆయన నిర్ణయం రాజకీయ దురుద్దేశమేనని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించింది. అసలు నిమ్మగడ్డ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంత వరకూ స్పష్టత లేదు. రాజకీయ పార్టీలతోసమావేశం పెట్టి.. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు సేకరించి… తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ విషయం తెలిసి కూడా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వంపై పగతో ఇప్పటి వరకూ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను రద్దు చేయబోతున్నారని.. ఆ నిర్ణయం నిబంధనల ప్రకారం చెల్లదని చెప్పుకొస్తూ… కథనం సిద్ధం చేసి.. ప్రసారం చేసేసింది. అందులో నిమ్మగడ్డపై వ్యక్తిగత విమర్శలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ పెద్దలను మెప్పించడానికి ఎన్టీవీ ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు కానీ… రాజ్యాంగ వ్యవస్థల నిర్ణయాలు తీసుకోక ముందే.., ఫలానా నిర్ణయం తీసుకుంటారని.. ఆయన కుట్రతోనే అలా చేస్తున్నారన్న వాదనతో వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. కథనం వండి వార్చడం ఏమిటనేది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కరోనా వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదనేది ఎన్టీవీ వాదన. బీహార్లో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. కానీ స్థానిక ఎన్నికలు మాత్రం బ్యాలెట్లతో నిర్వహించాలని .. అందుకే… సాధ్యం కాదన్నది ఎన్టీవీ వాదన. ఈ రివర్స్ వాదనలో ఎన్టీవీ వైసీపీ నేతల్ని మించిపోయింది. కరోనా కారణంగా మొదటి సారి ఎన్నికల్ని వాయిదా వేసినప్పుడు… వైసీపీ నేతలకు మించి.. నిమ్మగడ్డపై ఎన్టీవీ దుమ్మెత్తిపోసింది. తప్పు చేశారన్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నది.ఇప్పుడు ఎన్నికలు పెడతామంటే.. కుట్ర చేస్తున్నారంటోంది. మొత్తానికి మీడియా రాజకీయ మేనరికంలో నలిగిపోతూ.. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేయడానికి సొంత వారికి మద్దతుగా నిలబడటానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధమవుతోందని ఎన్టీవీ లాంటి చానళ్లు అప్పుడప్పుడూ సాక్ష్యంగా నిలుస్తూ ఉంటాయి.