”ఏ విధంగా చూసినా భారమూ, ప్రమాదభరితమూ అయిన అణువిద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరస్కరించాలి. ప్రతిపక్ష నాయకుడుగా వున్నపుడు ఈ కేంద్రాన్ని ఆయన వ్యతిరేకించారు. అదే వైఖరిని ఇపుడు కూడా కొనసాగించాలి – ”అణువిద్యుత్ – పర్యావసానాలు” అంశం మీద శ్రీకాకుళంలో జరిగిన సదస్సు ఈ మేరకు పిలుపు ఇచ్చింది.
అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించ తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంట్ ప్రభావాలను కేంద్ర ఇంధనశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఇఎఎస్ శర్మ, సిపిఎం పాలిట్ బ్యూరో మెంబర్ ప్రకాష్ కారత్ విశ్లేషించారు ఆవివరాల ప్రకారం…
అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చకున్న ఒప్పందం ప్రకారం 2 లక్షల 80 వేల కోట్ల రూపాయలతో భారతదేశంలో వెస్టింగ్‌హౌస్ కంపెనీ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతుంది.
1) అణు విద్యుత్‌తో పోలిస్తే జల, గ్యాస్, సోలార్ విద్యుదుత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. ధర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో ఒక మెగావాట్ విద్యుదుత్పత్తికి రూ.5 కోట్లు పెట్టుబడి అవసరం కాగా అణు విద్యుత్‌కు రూ.48 కోట్లు ఖర్చవుతుంది. ఇందువల్ల ఈ ప్లాంట్‌లో తయారయ్యే విద్యుత్ యూనిట్ ధర రూ.15 అవుతుంది.
2) ఈ కేంద్రానికి 6 రియాక్టర్లు అవసరం. ఒకే చోట ఇన్ని రియాక్టర్లు వుంచడం ప్రమాదకరం…ఏ విస్ఫోటనం జరిగినా మూడునాలుగు జిల్లాల్లో జనజీవనం పరిస్ధితి అనూహ్యం. అణు కేంద్రాల్లో ప్రమాదాల తీవ్రత దృష్ట్యా అమెరికాతో సహా అగ్రరాజ్యాలు అణు విద్యుత్ ఉత్పత్తిని మానుకున్నాయి. ప్రమాదం జరిగితే అమెరికా ప్రభుత్వం గానీ, రియాక్టర్లు సరఫరా చేసే కంపెనీగానీ బాధ్యత వహించనవసరం లేని విధంగా అమెరికాతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఆ అగ్రిమెంటు ప్రకారం నష్టాల భారాన్ని భారతీయ భీమా కంపెనీలే మొయ్యాలి
3) అణుప్లాంట్‌ను గుజరాత్‌లోని మితివిర్ధిలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదట నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులూ పొందాక దాన్ని దాన్ని ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వాడ కు మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అవసరానికి మించి విద్యుదుత్పత్తి జరుగుతున్నందున కొవ్వాడలో రూ.2.8 లక్షల కోట్ల పెట్టుబడితో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.
4) అమెరికా వొద్దనుకున్న అణు విద్యుత్ ఉత్పత్తి ఆదేశంలో ఒక దివాళా తీసిన కంపెనీని బతికంచడానికే అన్నట్టు భారతదేశం ప్రయాణమై గుజరాత్ తో మకాం చేసింది. అందులో వున్న రిస్కులవల్లో ఏమో గుజరాత్ దాన్ని నైస్ గా ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసింది. చంద్రబాబు ప్రతిపక్షనాయకుడుగా వున్నపుడు అణు విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకంచారు. ఇపుడు ఆయనే ముఖ్యమంత్రికనుక అణు విద్యుత్ కేంద్రం మాకు వొద్దని తిరస్కరించాలి.
ఈ మేరకు అని ప్రజాహిత సంఘాలనూ కలుపుకుని ప్రజల్ని ఉద్యమింపజేయడానికి సిపిఎం కృషి చేస్తుందని కారత్ చెప్పారు.