అటకెక్కిన నియోజకవర్గాల విస్తరణ ఫైలు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలోకి గోడదూకెయ్యడాలు ఇక ఆగిపోయినట్టే! నియోజక వర్గాల పెంపుదల ఆలోచనను కేంద్రప్రభుత్వం పెండింగ్ లో పెట్టడమే ఇందుకు మూలం!
ఏపీలో ఉన్న 175 సీట్లను 225కు, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 కు పెంచేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులూ రాసిన లేఖలకు కేంద్రం సరే అంది. పెంచేద్దాం పరవాలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చేశారు. ఇందులో సమస్య లేదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు.
అంతకంటే ముందు తెలంగాణాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను చేర్చకునే ముందు టిఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునే ముందు తెలుగుదేశం ” మీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన వల్ల అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరుగుతాయి కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పేచీ వుండదని నమ్మించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కార్నర్ చేస్తున్నారు. కరువు నిధుల విడుదలతో పాటు వెనకబడ్డ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు తనను విమర్శించడం ఆపి కేంద్రం నుంచి నిబంధనలు రాబట్టాలని కేసీఆర్ సూచిస్తున్నారు.
ఏపీలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. పేరుకు కేంద్రం, రాష్ట్రంలో పొత్తుల ప్రభుత్వాలు నడుపుతున్నా… ఒకరు వైదొలిగితే ప్రభుత్వాలు కూలే పరిస్థితి లేదు. స్పెషల్ స్టేటస్ విషయంలో రెండు పార్టీలు రహస్యంగా కత్తులు నూరుకుంటున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తే…పోరాడి తెచ్చిన చాంపియన్గా వచ్చే ఎన్నికల్లో గెలవొచ్చని.. ఒక వేల ఇవ్వని పక్షంలో బీజేపీని దోషిగా నిలిపి లబ్ది పొందొచ్చని తెలుగుదేశం భావిస్తుంది. ఆ అవకాశం ఇవ్వకూడదని బిజెపి నిర్ణయించుకుంది.
“తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెంచడమంటే కెసిఆర్, చంద్రబాబు వీపులు గోకడమే తప్ప ప్రజాప్రయోజనాలేవీ లేవు. ఇద్దరు ముఖ్యమంత్రులూ బిజెపితో సర్దుబాటు ధోరణితోనే తప్ప స్నేహభావంతో లేరు. నియోజక వర్గాల పెంపు వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాలను మాకు షేర్ చేస్తారన్న నమ్మకంలేదు” అని బిజెపిలో ఉన్నత స్ధాయి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
తెలంగాణాలో టిఆర్ఎస్, ఎపిలో బిజెపి పార్టీల బలాలు పెంచి, తనకు ఏమాత్రం రాజకీయంగా వుపయోగపడని పెంపుదల అనవసరమని బిజెపి భావించడమే ఈ ప్రతిపాదనను పక్కన పెట్టడానికి కారణం.
నియోజకవర్గాలను పెంచడానికి రెండు పద్ధతులు వున్నాయి…. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ను సవరించాల్సి ఉంది. రాజ్యసభ లో కాంగ్రెస్ సహకరిస్తే తప్ప బిల్లు గట్టెక్కే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ అందుకు రెడీగా లేదు. ఇక నియోజకవర్గాల పెంపును పెంచేందుకు రెండో దారి కూడా ఉంది. దేశ వ్యాప్తంగా 2026 వరకు నియోజక వర్గాలను పెంచోద్దని ఆర్టికల్ 170 క్లాజ్ 3 స్పష్టం చేస్తుంది. ఈ లోగా పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. అయితే ఈ మార్గంలో వెళ్లేందుకు కేంద్రం సాహసించడం లేదు. అయితే డైరెక్ట్ గా నో చెప్పకుండా ప్రక్రియను కొనసాగిస్తూ సాంకేతిక కారణాలతో వచ్చే ఎన్నికల వరకూ విషయాన్ని సాగదీయడమే బిజెపి ఎత్తుగడ! తప్పక చేస్తాం, చేస్తూనే వున్నాం అంటూనే ఏమీ చేయని – (నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించే) విద్య బిజెపికి వచ్చినంత కాంగ్రెస్ కి రాదు.
మొత్తంగా నియోజకవర్గాల పెంపును కేంద్రం రాజకీయ కారణాలతో అటకెక్కించింది. దీంతో తెలుగురాష్ట్రాల్లో గోడలు దూకేసిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల మాదిరిగా తయారైంది.