దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో పరారీలో ఉన్న నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన తర్వాత నూతన్ నాయుడు కనిపించకుండా పోయారు. ఆయన కర్ణాటకలోని ఉడుపిలో ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయాన్ని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా ప్రకటించారు. అయితే… శిరోముండనం చేస్తున్నప్పుడు అక్కడ నూతన్ నాయుడు లేడు. కానీ అక్కడ ఉన్న వారిలో ఒకరు..వీడియో కాల్ చేసి..మరీ మరో వ్యక్తికి చూపించారు. వీడియోకాల్ ద్వారా చూసిన వ్యక్తి..నూతన్ నాయుడు అని..పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో నూతన్ నాయుడు ప్రమేయం కూడా ఉందని..గుర్తించామని సీపీ ప్రకటించారు.
అయితే అనూహ్యంగా.. నూతన్ నాయుడుపై మరో ఫేక్ కాల్ కేసు నమోదు చేశారు. నిన్నామొన్నటి వరకు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పేరుతో నూతన్‌నాయుడు ఫేక్ కాల్స్ చేశాడని కమిషనర్ ప్రకటించారు. ఆ ఫేక్ కాల్స్ ఎవరికో కాదు… విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ కి చేశారట. ఫేక్ కాల్స్ వచ్చినట్లు డా.సుధాకర్ పీవీ రమేష్‌కు తెలిపారని … విషయం తెలిసిన వెంటనే పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీ ప్రకటించారు. కేసు దర్యాప్తు చేయగా అలా కాల్స్ చేసింది నూతన్‌నాయుడని తేలిందంటున్నారు. ఆ ఫోన్ నెంబర్‌తో పలు కాల్స్ చేసినట్లు గుర్తించామన్నారు. అసలు పీవీ రమేష్ పేరుతో… మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుధాకర్ కు కాల్స్ చేయాల్సిన అవసరం నూతన్ నాయుడుకు ఏమిటో పోలీస్ కమిషనర్ చెప్పలేదు.
సెల్ ఫోన్ దొంగిలించాడన్న కారణం చూపి… శ్రీకాంత్ అనే దళిత యువకుడికి..తన ఇంట్లోనే బార్బర్‌ను పిలిపించి మరీ శిరోముండనం చేశారు. నూతన్ నాయుడు భార్య..దగ్గరుండి ఈ పని చేయించారు. వారు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లోనే ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన వారిలో నూతన్ నాయుడు ఎనిమిదో వ్యక్తి. ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్ సీజ్ చేశామని సీపీ ప్రకటించారు. ఇప్పటి వరకూ..నూతన్ నాయుడిని అరెస్ట్ చేయకపోవడంతో రాజకీయ దుమారం రేగింది. గతంలో నూతన్ నాయుడు తాను వైసీపీకి జెండా..అజెండా రూపకల్పనకు సాయం చేశానని ప్రకటించుకున్నారు. ఈ కారణంగానే అరెస్ట్ చేయలేదా అన్న విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు