బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఆగడాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడుపై కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి పేరుతో ఫోన్ కాల్ చేసి పనులు చేయించుకున్న సంగతి వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు అనుమానించినట్టుగానే ఒక్కొక్కటిగా నూతన్ నాయుడు మోసాల చిట్టా బయటపడుతోంది. ఆగస్ట్ 28న శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడు బంధువులు, సిబ్బంది మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. నూతన్ నాయుడుని ఉడుపిలో అరెస్ట్ చేసి విశాఖకు తీసుకు వచ్చారు.
ఇప్పుడు నూతన్ నాయుడు బాధితులమంటూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి బ్యాంకులో రీజనల్ డైరక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని కోట్లల్లో డబ్బు వసూలు చేశాడనీ.. విశాఖజిల్లా రావికమతం మండలానికి చెందిన నూకరాజు అనే వ్యక్తికి ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని నాలుగు లక్షల వరకు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇవేకాకుండా విశాఖ గాజువాకలో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసుల్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. తాజాగా మరో రెండు కేసులు నమోదవడంతో ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు.
సామాన్యవ్యక్తిగా బిగ్బాస్ షోలో అభిమానులను సంపాదించుకుని .. సెలబ్రిటీగా తనను తాను మార్చుకున్న నూతన్ నాయుడు దాన్ని మోసాలకు వినియోగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇంకెవరైనా ఫిర్యాదు చేసినా.. సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించారు. నూతన్ నాయుడు.. ఆయన కుటుంబసభ్యులు .. పని వాళ్లకూ ఇంకా బెయిల్ లభించలేదు. జైల్లోనే ఉన్నారు.