జనసేన పార్టీలోకి చేరికలను పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే ప్రొత్సహిస్తున్నారు. ఓ మాజీ క్రికెటర్‌కు..మరో మాజీ బ్యాడ్మిటంన్ ప్లేయర్‌కు కండువాలు కప్పారు. పార్టీలో చేరాలని ఉందని వచ్చిన వారిని నిరాశ పరచడం లేదు. కానీ ఆయన దృష్టి.. రాజకీయ వలసలపై లేదు. ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్లపైనా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పార్టీలో చేరతానని వచ్చిన పీఆర్పీ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యను ఓ సారి కలవడానికి కూడా అంగీకరించలేదు. తర్వాత కలిశారని.. పార్టీలో చేరమన్నారని.. టిక్కెట్ కన్ఫర్మ్ చేశారని మీడియాలో ప్రచారం జరిగింది కానీ.. అసలేం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
అంటే .. పవన్ కల్యాణ్ వచ్చిన వాళ్లనే పట్టించుకోవడం లేదు.. ఇక రారమ్మని ఎవర్నైనా పిలుస్తారా..? పవన్ కల్యాణ్‌ను దగ్గరగా పరిశీలించి చూసిన వారెవరైనా… అస్సలు చాన్సే లేదని చెప్పేస్తారు. కానీ బిగ్‌బాస్ కంటెంస్టెంట్.. నూతన్ నాయుడు మాత్రం.. తనను పవన్ కళ్యాణ్ కాకితో కబురు పెట్టినా.. వెళ్లి చేరిపోతానని ప్రకటనలు చేస్తున్నారు. అంటే.. తనంతట తాను వెళ్లను కానీ… పవన్ చిటికేస్తే మాత్రం వెళ్తానని ప్రకటిస్తున్నారన్నమాట. నూతన్ నాయుడుకి గతంలో చాలా రాజకీయ నేపధ్యం ఉంది. బిగ్‌బాస్‌లోకి సామాన్యుడిగా ఎంటరయ్యారు. అక్కడ ఆయన చరిత్ర మొత్తం చెప్పుకున్నారు. అప్పుడే అందరూ గుర్తించారు. పీఆర్పీలో పని చేశారని.. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేశారని.. అంతకు మించిన “ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్”ఉన్నాయని తెలుసుకున్నారు.
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని చానళ్లు ఇంటర్యూలు తీసుకున్నాయి. యూ ట్యూబ్ చానళ్లు అయితే.. అసలు వదిలి పెట్టడం లేదు. ఇందులో రాజకీయాలపై ప్రశ్నలు లేకుండా ఉంటాయా..?. ఈ ప్రశ్నలను.. నూతన్ నాయుడు .. తన స్థాయిని చెప్పుకోవడానికి తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తనకు పవన్ కల్యాణ్…నటుడిగా సత్యానంద్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటి నుంచి తెలుసని.. చెప్పుకున్నారు. పుస్తకాల గురించి చర్చించుకునేవారట. ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించారట. ప్రజారాజ్యంలో కలసి పనిచేశారట. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిందట. ఇప్పుడు పిలిస్తే అస్సలు ఆగనంటున్నారు..!
మొత్తానికి రాజకీయాల్లో ఏదో విధంగా .. గట్టి ముద్రే వేయాలనుకుంటున్న నూతన్ నాయుడు… చాలా తెలివిగా ప్రవర్తించేస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎంతో కొంత గుర్తింపు వచ్చింది కాబట్టి.. తానే వెళ్లి నేరుగా జనసేనలో చేరితో.. పవన్ పట్టించుకుంటారో లేదోనని.. ఆయనతోనే పిలుపు అందుకంటే.. పార్టీలోనూ ప్రాధాన్యం దక్కుతుందని… గట్టి ప్లానే వేసుకున్నారు. అందుకే… పిలుపు వస్తే చాలు వెళ్తానంటున్నారు కానీ.. నేరుగా వెళ్లి పార్టీలో చేరతానని చెప్పడం లేదు. మొత్తానికి నూతన్ …కాస్త నూతనంగా.. పాత రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు.