విశాఖలో బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఫ్యామిలీ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటనలో… అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. క్షురకుడ్ని పిలిపించి.. గుండు కొట్టించడమే కాకుండా.. ఇనుపరాడ్‌తో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీంతో విశాఖ పోలీసులు నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు.. ఆ ఇంటి పని మనుషులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాలను పోలీస్ కమిషనర్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు.
శ్రీకాంత్… నాలుగు నెలల పాటు నూతన్ నాయుడు ఇంట్లో పని చేశాడు. ఈ నెల ఒకటో తేదీన జీతం తీసుకుని మానేశాడు. ఆ సమయంలో నూతన్ నాయుడు ఇంట్లో ఐఫోన్ చోరీకి గురయింది. అది శ్రీకాంతే తీసుకున్నాడన్న అనుమానంతో ఒకటికి రెండు సార్లు పిలిపించి అడిగారు. కానీ తాను తీసుకోలేదని… శ్రీకాంత్ బదులిచ్చారు. అయితే..పదే పదే పిలుస్తూండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు. తమకే ఎదురు చెబుతాడా అన్న కసితో.. నూతన్ నాయుడు ఫ్యామిలీ శ్రీకాంత్‌ను పిలిపించి.. దాడి చేసి.. శిరోముండనం చేయించారు.
ఈ ఘటన… రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఏపీలో వరుసగా జరుగుతున్న దళితులపై దాడుల ఘటనలో..ఇది కూడా ఒకటి కావడంతో.. రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. గతంలో.. పోలీస్ స్టేషన్లోనే దళితుడికి శిరోముండనం చేయించినప్పుడు తీవ్రమైన చర్యలు తీసుకుని ఉంటే.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగి ఉండేవి కావని… ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీకాంత్ ఫిర్యాదును సోషల్ మీడియాలో పెట్టే వరకూ పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత మీడియాలో హైలెట్ అవడతంతో విచారణ జరిపి.. కేసు నమోదు చేశారు.