తమిళనాడులో రాజకీయాలు, పరిస్థితులు వేడెక్కాయి. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా పారామిలటరీ దళాలతో కలిసి సెక్రటేరియట్ పై ఐటీ దాడులు జరగడం, సీఎస్ రామ్మోహన్ రావును ఇరుకునపెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణాలు వెతికే పనిలో పడ్డారు అన్నాడీఎంకే నేతలు అనే కథనాలు తమిళనాట వెలుగులోకివాస్తున్నయి. అమ్మ జయలలిథ ఉన్నంతకాలం ఆమె మాటే వేదంగా నడిచిన నాయకులు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడే ఉంటామని ప్రకటించిన నేతలు ఇప్పుడు ఎవరికి తోచినట్లు వారు వ్యూహాలు పన్నుతున్నారనేది తెలిసిన విషయమే. ఎవరిస్థాయిలో వారు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటు లోలోపల ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. దీనికి ఉదాహరణ… జయలలిత ఎంతగానో నమ్మిన పన్నీర్ సెల్వం సీఎంగా ఉన్న సమయంలోనే శశికళను సీఎం చేస్తాం అంటూ బహిరంగంగా మీడియా ముందు చెబుతున్నారు.
దీంతో రాజకీయంగా శశికళ వర్గంలో కొందరు, పన్నీర్ సెల్వం వర్గంలో మరికొందరు నాయకులు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఇదే క్రమంలో శశికళను సీఎం చెయ్యాలనే నినాదాన్ని అన్నాడీఎంకే అనుబంధ సంస్థ జయలలిత పెరవై కూడా తెరమీదకు తీసుకువచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే పన్నీర్ సెల్వం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన తరువాత అదే రోజు రాత్రి చెన్నై తిరిగి వచ్చేశారు. ఇది జరిగింది సోమవారం. సరిగ్గా మరుసటి రోజైన మంగళవారం సీబీఐ అధికారులు చెన్నై చేరుకుని ఐటీ అధికారుల అదుపులో ఉన్న శేఖర్ రెడ్డిని విచారణ చేశారు. అనంతరం బుధవారం వేకువ జామున తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అదేరోజు మద్యాహ్నం సెక్రటేరియట్ లోని రామ్మోహన్ రావు కార్యాలయంలో సోదాలు చేశారు. అయితే ఇంతజరుగుతున్నా ఈ విషయంపై సీఎం పన్నీర్ సెల్వం ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా మౌనంగానే ఉండిపోయారు. అలాగే… పార్టీ అధ్యక్షురాలు కాబోతున్న శశికళ కూడా మౌనాన్నే తన బాషగా చేసుకున్నారు. దీంతో రామ్మోహన్ రావు పై ఐటీ దాడులు అనే అంశంలో రాజకీయ కోణాలు బయటపడుతున్నాయనే కథనాలు మొదలయ్యాయి.
రామ్మోహన్ రావు గత నాలుగైదు రోజుల నుంచి శశికళకు మద్దతు ఇస్తున్నారని వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వం తన కార్యాలయంలో అత్యవసరంగా మంత్రులతో సమావేశం అయిన సమయంలోనే రామ్మోహన్ రావ్ కార్యాలయంలో సోదాలు చేశారు. దీంతో పన్నీర్ సెల్వం వర్గీయులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడం వలనే దాడులు జరిగాయని శశికళ వర్గం నేతలు ఆరోపిస్తున్నారట. వీరి వెర్షన్ అలా ఉంటే… జయలలితకు ఆప్తుడైన రామ్మోహన్ రావు, సీఎం పన్నీర్ సెల్వంకు సహకరిస్తున్నారనే అనుమానంతో శశికళ వర్గంలోని మంత్రులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడం వలనే దాడులు చేశారని అవతలి వర్గం ఆరోపిస్తుంది. దీంతో… రామ్మోహన్ పై ఐటీ దాడుల సంగతేమో కానీ ఈ దాడుల పుణ్యమాని అన్నాడీఎంకే నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి బహిరంగంగా వచ్చాయని తెలుస్తుంది.