తెలుగు360 రేటింగ్: 1.5/5
మీకో పిట్ట కథ చెబుతా!
అనగనగా ఓ అందమైన అమ్మాయి.
చైనా నుంచి ఓ అబ్బాయి దిగాడు.
వరసకు బావే. ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇంట్లో కూడా ఓకే అన్నారు. తీరా చూస్తే ఆ అమ్మాయి మిస్సింగు. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు? వెదికి పట్టుకోవడమే కథ.
ఇదేంటి ఇంత చిన్న కథ.. పెద్ద మేటరేం లేదు కదా అనుకుంటున్నారా.
చెప్పాం కదా.. ఇదో పిట్ట కథ అని. కథలో విషయం ఆశించకూడదు.
ఈ కథని దర్శకుడు నమ్మడంలో వింత లేదు. ఎందుకంటే ఆయన రాసుకున్న కన్ఫ్యూజన్ కథ (ఇది ఆయనే చెప్పుకున్నాడు… టైటిల్ కార్డులో) ఆయన నమ్మకపోతే ఎలా? ఇద్దరు హీరోలు నమ్మారు. నమ్మక ఛస్తారా.. వాళ్లకు అవకాశం రావడమే గొప్పలా అనిపించింది పరిస్థితి. కానీ నిర్మాత నమ్మడమే ట్రాజడీ. ఆయన ఈ కథని నమ్మి, కోట్లు పెట్టుబడి పెట్టాడంటే…. కథలో కాదు, కథనంలో మ్యాజిక్ ఉందనే అర్థం. మరి అదైనా పద్ధతిగా సాగిందా? లేదంటే అది కూడా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే (ఇది కూడా దర్శకుడే అన్నాడు) నా?? ఈ పిట్టకథలో ఉన్న గట్టి మేటరేంటి?
కథ
ముందే చెప్పాం కదా. ఇదో కిడ్నాప్ కథ అని. ఆ పిట్టకథని 70 ఎం.ఎం కి తర్జుమా చేస్తే..
వెంకటలక్ష్మి అనే అల్లరి పిల్ల కథ ఇది. నాన్న వీర్రాజు అంటే చాలా ఇష్టం. తల్లి లేని పిల్ల కదా అని వీర్రాజు కూడా గారాబంగా పెంచాడు. సడన్ గా ఓ రోజు చైనా నుంచి మేనల్లుడు దిగాడు. తన పేరు.. క్రిష్. మేనల్లుడి పద్ధతి, మాటతీరు వీర్రాజుకి బాగా నచ్చింది. క్రిష్ కూడా వెంకటలక్ష్మి అందానికి, అల్లరికి పడిపోయాడు. వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని మావయ్యకు చెప్పాడు. మావయ్య సరే అన్నాడు. అయితే అదే రోజు అరకు వెళ్లిన వెంకటలక్ష్మి కనిపించకుండా పోతుంది. అందరి అనుమానమూ.. ప్రభు పైనే. వెంకటలక్ష్మిని ప్రభు చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. అందుకే తనే పగ పెంచుకుని వెంకటలక్ష్మిని ఏమైనా చేశాడేమో అని పోలీసులు కూడా భావిస్తారు. ప్రభు వ్యవహారం కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. మరి వెంకటలక్ష్మిని ప్రభునే కిడ్నాప్ చేశాడా? చేస్తే ఎందుకు చేశాడు? ఈ పిట్ట కథ వెనుక ఉన్న అసలు కథేమిటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కథ పిట్టంత ఉందా, పర్వతం అంత ఉందా? అని కాదు. ఆ కథని చెప్పే పద్ధతి ఎలా వుంది? అనేదే ముఖ్యం. ఒక్కోసారి చిన్న కథల నుంచే పెద్ద పెద్ద మ్యాజిక్కులు చేయొచ్చు. క్రైమ్, సస్పెన్స్, మర్డర్ మిస్టరీలాంటి సినిమాలకైతే… పిట్ట కథ సరిపోతుంది కూడా. దర్శకుడు ఇందులో లవ్ స్టోరీ, కామెడీ కూడా మిక్స్ చేసే ప్రయత్నం చేశాడు.
ఇలాంటి మిస్టరీ కథల్లో సాధారణంగా జరిగేదేంటంటే.. అనుమానం అంతా ఓ పాత్రవైపు మళ్లుతుంది. తీరా చూస్తే.. అతను అమాయకుడన్న విషయం అర్థం అవుతుంది. ఆ తరవాత మరో పాత్ర రంగ ప్రవేశం చేస్తుంది. పిట్టకథ కూడా ఆ పిట్ట గోడమీదే… తకథిమితోం అంటూ ఆడింది. ఇంతటి రొటీన్ లైన్ పట్టుకుని దర్శకుడు జిమ్మిక్కులు చేయడానికి ప్రయత్నించాడు. కథని ప్రారంభించిన విధానం టీవీ సీరియల్ పోకడల్ని తలపిస్తుంది. అంత నిదానమైన కథనం, తీత విసుగెత్తిస్తాయి. వెంకట లక్ష్మి మిస్సింగ్ కేసు నుంచి కథ ఉరుకులు పరుగులు పెట్టాలి. కానీ అదేం జరగదు. ఇది వరకు చూసేసిన సన్నివేశాన్నే మళ్లీ చూపిస్తూ.. దానికి వేరే రంగు అద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో చూసిన సన్నివేశం ఒకలా అర్థమైతే… దాన్ని సెకండాఫ్‌లో చూసినప్పుడు మరోలా అర్థమవుతుంది. నిజానికి ఇది మంచి టెక్నిక్కే. కానీ… పదే పదే అదే చూపించడం వల్ల… ఒకే సినిమాని రెండు మూడు సార్లు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు.
అసలు ఇనస్పైక్టర్ బ్రహ్మాజీ పాత్రని డిజైన్ చేసిన పద్ధతి చూస్తే దర్శకుడి పనితనంపై అనుమానం కలుగుతుంటాయి. ఆ పాత్రని ఏదో ఇంటిలిజెంట్ ఫెలోలా డిజైన్ చేద్దామనుకున్నాడు దర్శకుడు. చివరికి ఆ పాత్రనే బకరాని చేసేశాడు. కిడ్నాప్ చేసు గురించి ఎవరేం చెప్పినా ఆ ఎస్ ఐ గుడ్డిగా నమ్మేయడం చూస్తుంటే… మన పోలీసుల పనితీరు ఇలా ఉంటుందా? అనే అనుమానం వస్తుంది. నిజానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ బలంగా ఉండాల్సింది. బ్రహ్మాజీ కాకుండా ఓ పవర్ ఫుల్ నటుడు ఆ పాత్ర చేసుంటే, ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి మార్చుంటే ఫలితం కనిపించేదేమో..?
కథలో మలుపులన్నీ ద్వితీయార్థంలో దాచుకున్నాడు దర్శకుడు. దాంతో ఫస్టాఫ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ట్విస్టులున్నా దాన్ని ఉపయోగించుకునే విధానం బాలేదు. కొన్ని సిల్లీ రీజన్స్ కనిపిస్తుంటాయి. చివరికి అందరూ తెలివైన వాళ్లే.. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప.. అన్నట్టుంటుంది సినిమా.
మన థియేటర్‌కి జనం రావాలని… కూల్ డ్రింక్ కొన్నవాళ్లకు సమోసా ఫ్రీ ఇచ్చాను మావయ్యా… అంటూ ఓ డైలాగ్ ఉంటుందీ సినిమాలో. నిజంగా ఇలాంటి పిట్ట కథలు తీస్తే మాత్రం కూల్ డ్రింక్ సమోసాలతో పాటు టికెట్టు కూడా ఫ్రీగా ఇస్తామని పబ్లిసిటీ చేసుకోవాల్సివస్తుంది.
నటీనటులు, సాంకేతికత
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ప్రభు పాత్రలో కనిపించాడు. తన ముఖంలో అస్సలు ఫీలింగులే పలకలేదు. తనని ఇంకా ససానబెట్టాల్సిందే. విశ్వంత్ ఓకే అనిపిస్తాడు. ఇక నిత్యాశెట్టిలో స్వాతి పోలికలు కనిపిస్తాయి. నటన కూడా అంతే సహజంగా ఉంది. బ్రహ్మాజీ పాత్రని సరిగా వాడుకోలేదు. మిగిలినవాళ్లంతా ఫర్వాలేదనిపిస్తారంతే.
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కావల్సిన లైన్ పిట్టకథకు దొరికింది. కానీ దాన్ని డీల్ చేసిన విధానమే బాలేదు. నత్తనడక స్క్రీన్ ప్లే, ఊహించేసే మలుపులు, బలమైన క్యారెక్టరైజేషన్స్ లేకపోవడం ఈ పిట్టకథకు పెద్ద శత్రువులు. పాటలకు అంతగా ప్రాధాన్యం లేదు. అవి కూడా అంతే సాదాసీదాగా సాగాయి. ఫొటోగ్రఫీ ఒక్కటే ప్లస్ పాయింట్.
ఫినిషింగ్ టచ్: పిట్ట ఎగరలేదు
తెలుగు360 రేటింగ్: 1.5/5