కడప జిల్లా గండికోటలో టూరిజం అభివృధ్ది చేయడం అంటే.. స్టార్ హోటల్ కట్టడం అన్నట్లుగా సీఎం జగన్ చెబుతున్నారు. ఓబెరాయ్ హోటళ్లకు విశాఖ, తిరుపతిలో అత్యంత ఖరీదైన స్థలాలను ఇచ్చారు. అలాగే గండికోటలో కూడా ఇచ్చారు. ఈ మూడు చోట్ల స్టార్ హోటళ్లను కట్టడానికి శంకుస్థాపన చేశారు. గండికోటలో నేరుగా శంకుస్థాపనలో పాల్గొన్ జగన్.. తిరుపతి, విశాఖ శంకుస్థాపనలను వర్చువల్‌గా నిర్వహించారు.
జగన్ ప్రసంగం స్టార్ హోటల్ కట్టడం వల్ల గండికోట టూరిజం సర్క్యూట్ లో చేరిపోతుందన్నట్లుగా ఉంది. గండికోటలో గోల్ఫ్ కోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఒబెరాయ్‌ని కోరానని సీఎం చెప్పారు. అంటే… ఈ పేరుతో మరో రెండు, మూడు వేల ఎకరాల వరకూ ఆ కంపెనీ ఖాతాలో ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో పులివెందుకు ఫిష్ మార్టులు ప్రకటించినంత గొప్పగా స్టార్ హోటల్ నుప్రకటించడం. అదీ కూడా ప్రైవేటు సంస్థ నిర్మిస్తూందని చెప్పడంతో.. ఇదేదో గోల్ మాల్ వ్యవహారంలా ఉందని ఎక్కువ మంది అనుకుంటున్నారు.
ఓబెరాయ్ హోటల్ గ్రాండ్ క్యానన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు. స్టార్ హోటల్‌తో గండికోటను ప్రపంచానికి పరిచయం కాబోతోందని గొప్పలు చెప్పారు. ఈ సమావేశంలో మరో కబురు చెప్పారు. అదేమిటంటే.. తానే స్వయంగా రెండో సారి శంకుస్థాపన చేసిన స్టీల్ ఫ్యాక్టరీకి ఇంకా అనుమతులు రాలేదని. స్టీల్ ప్రాజెక్టుకు ఈ జూలై 15కు పర్యావరణ అనుమతులు వచ్చేస్తాయని చెప్పారు. ఆ వెంటనే పనులు వేగంగా జరుగుతాయని చెప్పుకొచ్చారు. గండికోట టూరిజం కోసం గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో పది శాతం కూడా ఖర్చు చేయలేదు. కానీ ఆ చుట్టుపక్క భూములు మాత్రం హోటళ్లు.. గోల్ఫ్ కోసం కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.