తెలంగాణకు పెట్టుబడులు వస్తే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. అవన్నీ కాలుష్య పరిశ్రమలన్న ప్రచారం చేస్తోంది. అదానీ గ్రూపులో ఉన్న అంబూజా సిమెంట్స్ తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకుంటోంది. ఇందు కోసం రామన్నపేట దగ్గర స్థలాలను కూడా కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. సొంత మీడియా ద్వారా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
తమ భవిష్యత్ వ్యాపార అవసరాల కోసం రామన్నపేటలో భూములు కొనుగోలు చేసింది అదానీ సంస్థ. అదానీ లాంటి పెద్ద సంస్థ కొనుగోలు చేస్తుందంటే.. ఖచ్చితంగా ఏదో ఓ ఫ్యాక్టరీ పెడతారని ఉపాధి లభిస్తుందని అక్కడి ప్రజలు అనుకుంటారు. లాజిస్టిక్ పార్క్, సిమెంట్ పరిశ్రమ వంటివి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ముందుగా సిమెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా సహకరిస్తామని తెలంగాణ సర్కార్ చెబుతోంది.
అయితే జనావాసాల్లో జనావాసాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రాణాంతక రోగాలు వస్తాని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. గర్భస్రావం, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు నల్లగొండ జిల్లా మొత్తం సిమెంట్ పరిశ్రమలు ఉంటాయి. అక్కడ లేని రోగాలు అదానీ పెట్టే పరిశ్రమకే ఎలా వస్తున్నాయో బీఆర్ఎస్ చెప్పాల్సి ఉంది. బీఆర్ఎస్ హయాంలోనే అదానీ సంస్థ భూములు కొనుగోలు చేసింది. ఓ ఫార్మా కంపెనీ వల్ల కాలుష్యం వస్తుందని చెప్పవచ్చు కానీ.. సిమెంట్ పరిశ్రమ ద్వారా ఏదో అయిపోయిందని చెప్పి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని వెళ్లగొట్టడం ఏమిటన్న ప్రశ్న సహజంగానే ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.