క్రిష్ నుంచి వస్తున్న సినిమా `కొండపొలెం`. ఇదో నవలా చిత్రం. తానా నవలల పోటీల్లో ప్రధమ బహుమతి పొందిన `కొండపొలెం`ని అదే పేరుతో తీస్తున్నాడు క్రిష్. వైష్ణవ్ తేజ్ హీరో. రకుల్ హీరోయిన్. రకుల్ పోషిస్తున్న ఓబులమ్మ.. పాత్రని ఈరోజే పరిచయం చేశారు. `నీలో.. నాలో` అంటూ సాగే ఓ మెలోడీ బిట్.. ని వదిలారు. నిజానికి కొండపొలెం నవలలో హీరోయిన్ పాత్రంటూ ఉండదు. కథలో రొమాక్స్ కి ఎక్కడా చోటుండదు. అది క్రిష్ సృష్టి అనుకోవాలి. క్రిష్ ఎప్పుడూ కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడు. కేవలం కథని మాత్రమే ఫాలో అవుతాడు. కానీ కొండపొలెంలో కమర్షియల్ టచ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడేమో అనిపిస్తోంది. అందుకే ఓబులమ్మ పాత్రని తీసుకొచ్చాడు. ఈ కథంతా అటవీ నేపథ్యంలో సాగుతుంది. ఓ పులి నుంచి తన గొర్రెల మందని, తనని రక్షించుకోవడానికి హీరో చేసే సాహస గాథ ఈ చిత్రం. జంగీల్ బుక్ చూసిన అనుభూతి కలిగేలా.. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఇచ్చాడు క్రిష్. కథగా చదవడం కంటే, దృశ్య రూపంలో చూడడంలోనే `కొండపొలెం` మజా ఇస్తుంది. మరి.. దాన్ని క్రిష్ ఎంత వరకూ న్యాయం చేశాడో చూడాలంటే అక్టోబరు 8 వరకూ ఆగాలి.