వైసీపీలో 175 నియోజకవర్గాలకు పరిశీలకుల్ని నియమించారు. పులివెందులకు కూడా ఇప్పటి వరకూ బయటకు తెలియని ఓ రెడ్డి నేతను నియమించారు. అయితే ఈ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వైసీపీ నేతలు వింత వాదన చెబుతున్నారు. ఇంకా జగన్ ఆమోద ముద్ర వేయలేదని.. వేయగానే రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది ఎలా బయటకు వచ్చిందంటే లీక్ అంటున్నారు. కానీ పార్టీ నేతల స్పందనను తెలుసుకోవడానికే ఇలా జాబితా రిలీజ్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కనీసం 60, 70 మందికి టిక్కెట్లు నిరాకరించాలని అనుకుంటున్నారు. ఆ నియోజకవర్గాలకే ప్రత్యేకంగా పరిశీలకుల్ని నియమిస్తే..అసంతృప్తి పెరుగుతుదంని వ్యూహాత్మకంగా అన్ని నియోజకవర్గాలకు పరిశీలకుల్ని నియమించారు. కానీ జాబితా చూస్తే చాలా వరకూ అందులో ఉన్న ట్విస్ట్ అర్థమైపోతుంది. టిక్కెట్ కు ఢోకా లేదనుకున్న ఎమ్మెల్యేలు ఉన్న చోట ముక్కూ ముఖం తెలియని వారిని.. పక్క నియోజకవర్గాల నుంచి తెచ్చి పరిశీలుకుడి హోదా ఇచ్చారు. కానీ టిక్కెట్ రాదని భావిస్తున్న కొంత మంది నేతల నియోజకవర్గాల్లో మత్రం బలమైన నేతల్ని పరిశీలకులిగా నియమించారు
ఈ విషయంలో పార్టీ నేతలు ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే సర్దుబాటు చేయాలన్న ఉద్దేశంలో లిస్ట్‌కు ఇంకా జగన్ ఆమోదం రాలేదని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే జగన్ ఆమోదం లేకుండా లిస్ట్ బయటకు వచ్చేంత పరిస్థితి వైసీపీలో లేదు. ఈ సారి ఎన్నికల్లో జగన్ పలు కీలక ప్రయోగాలు చేయబోతున్నారు. నియోజకవర్గాలకు నేతల్ని అటూ ఇటూ కూడా మార్చాలనుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ వ్యూహమేంటో తెలియక పార్టీ నేతలు కూడా టెన్షన్‌కు గురవుతున్నారు.