గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నరాని.. వైసీపీలో చేరబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సహజంగా అయితే… టీడీపీలో ఇది కలకలం రేపాలి. కానీ.. టీడీపీలో అందరూ నింపాదిగా.. గంటా వెళ్తేనే మంచిదన్నట్లుగా ఉన్నారు. కానీ.. వైసీపీలో మాత్రం అలజడి రేగుతోంది. ఆయన పార్టీలో చేరిక ముహుర్తం ఖరారయిన వెంటనే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపణలు ప్రారంభించారు. కేసుల మాఫీ కోసమే… ఆయన వైసీపీలో చేరాలని అనుకుంటున్నారని… విమర్శలు గుప్పించారు. అంతటితో వదిలి పెట్టలేదు. గంటా లాంటి అవినీతి పరుడ్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ… అవంతి తన అనుచరులతో నిరసనలను కూడా ప్రోత్సహిస్తున్నారు.
వాస్తవానికి విజయసాయిరెడ్డికి కూడా గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరడం ఇష్టం లేదు. ఆయనకు కరోనా సోకడంతో.. మొదట అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది.. ఇప్పుడు ఫామ్హౌమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల్లో.. ఆయనకు ఎలాంటి సమాచారం హైకమాండ్ నుంచి వెళ్లడం లేదు. పార్టీలోని ఇతర నేతలు పనులు చక్క బెడుతున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గంటా ఎంట్రీకి ఈ సమయంలోనే క్లియర్ చేసేశారు. కొద్ది రోజుల కిందట.. గంటా సైకిళ్ల కుంభకోణం చేశారని.. తర్వాత శుక్రవారం ఆయననే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసింది. కానీ ఆ తర్వాతే ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
గంటా రాకను అడ్డుకోకపోతే… తన మంత్రి పదవికే టెండర్ పడుతుందని అవంతి శ్రీనివాస్ భయపడుతున్నారు. అందుకే.. ఆయనను పార్టీలోకి రాకుండా చేయడానికి చేయగలిగినంత చేస్తున్నారు. అదే సమయంలో తన గాడ్ ఫాదర్ లాంటి విజయసాయిరెడ్డిని కూడా.. ఈ విషయంలో దువ్వుతున్నారు. విజయసాయిరెడ్డి కూడా గంటా రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆయన వస్తే.. ఉత్తరాంధ్ర వైసీపీపై తన ముద్ర తగ్గడమే కాదు… ప్రత్యేకంగా గంటా ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటారని.. గ్రూపులు తయారు చేసుకుంటారని భావిస్తున్నారు. మొత్తానికి గంటాను పార్టీలోకి రాకుండా.. విజయసాయిరెడ్డి, అవంతి చేస్తారో.. లేక గంటాదే పైచేయి అవుతుందో… విశాఖ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.