‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ తరవాత.. పూరి జగన్నాథ్ చేస్తున్న సినిమా ‘ఫైటర్’. విజయ్ దేవరకొండ – పూరి కాంబో అనగానే, అంచనాలు మొదలైపోయాయి. పైగా ఇస్మార్ట్… హిట్ తో పూరి తన పూర్వకు ఫామ్ లోకి వచ్చేశాడు. అందుకే.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని మొదలెట్టాడు పూరి. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. మళ్లీ షూటింగ్ మొదలవ్వలేదు. డిసెంబరులో అయినా `ఫైటర్` సెట్స్‌పైకి వెళ్తుందనుకున్నారు. కానీ… ఇంకా ఫైటర్ కి ఊపు రాలేదు. దాంతో `ఫైటర్` మొదలవుతుందా, లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమా నిరవధికంగా వాయిదా పడబోతోందని, విజయ్ ఈ సినిమాని వదిలేసి, మిగిలిన సినిమాలపై దృష్టి పెట్టబోతున్నాడని, కొన్ని ఫైనాన్షియల్ సమస్యలూ ఉన్నాయని ప్రచారం మొదలైంది.
అయితే.. చిత్రబృందం మాత్రం `ఫైటర్` విషయంలో క్లారిటీగానే ఉంది. జనవరి నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని స్పష్టం చేస్తోంది. ఫైటర్ విషయంలో కొన్ని సమస్యలున్నాయి. ఈ సినిమా షూటింగ్ లో.. కొంతమంది విదేశీ ఫైటర్లు పాల్గొనాల్సివుంది. లాక్ డౌన్‌కి ముందు వాళ్లతో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు మళ్లీ ఆ ఫైటర్లతోనే ఓ షెడ్యూల్ షూటింగ్ చేయాలి. కరోనా భయాలతో విదేశీ ఫైటర్లు షూటింగులంటే ఉత్సాహం చూపించడం లేదు. వాళ్ల భయాలు తగ్గడానికి కొంత సమయం పట్టింది. దాంతో పాటు.. ఓ కీలకమైన షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేశాడు పూరి. అమెరికా వీసాలు అంత తేలిగ్గా దొరకడం లేదు. అందుకే `ఫైటర్` చిత్రీకరణ ఆలస్యమైంది. అయితే.. ఇప్పుడు అన్ని విషయాలూ ఓ కొలిక్కి వస్తున్నాయని, జనవరి నుంచి `ఫైటర్` బరిలోకి దిగుతాడని ఇన్సైడ్ వర్గాలు తెలిపాయి.