దసరా సీజన్‌తో ఈ నెల ఘనంగా ప్రారంభమైంది. ఈ నెలంతా సినిమాల హడావుడే. దీపావళి సీజన్లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈలోగా… కొత్త వారం వచ్చేసింది. ఈ శుక్రవారం కూడా బాక్సాఫీస్ దగ్గర హడావుడి కనిపించబోతోంది. మొత్తంగా 4 సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే… అందులో రెండు సినిమాలు మాత్రం ప్రేక్షకుల దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నాయి.
ఆకాష్ పూరి `రొమాంటిక్` ఈ శుక్రవారం విడుదల అవుతోంది. పూరి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, కథ, మాటలు అందించారు. దాంతో ఇది పూరి సినిమాగానే చలామణీ అవుతోంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఫక్తు మాస్ మసాలా సినిమాలానే అనిపిస్తోంది. పూరి గత సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నా – కుర్రకారుని థియేటర్లకు రప్పించే అంశాలు పుష్కలంగా దట్టించినట్టు అర్థమవుతోంది. ఈ సినిమాకి సంబంధించి రెండు ట్రైలర్లు వదిలారు. రెండిటిలోనూ డైలాగులు బాగా పేలాయి. దానికి తోడు ప్రచారం కూడా కాస్త గట్టిగానే చేస్తున్నారు. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి స్టార్ హీరోలను రంగంలోకి దింపేసరికి ఆటోమెటిగ్గా – రొమాంటిక్ పై చర్చ మొదలైపోయింది.
ఈ మాస్ సినిమాకి తోడుగా విడుదల అవుతున్న క్లాస్ సినిమా.. `వరుడు కావలెను`. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రీతూవర్మ నాయిక. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. సితారకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అది ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్. దానికితోడు.. ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామన్న ఫీలింగ్ ఇచ్చింది ట్రైలర్. శౌర్య – రీతూల జంట కూడా అందంగా కుదిరింది. దిగు దిగు దిగు నాథ.. పాట ఇప్పటికే బాగా పాపులర్ అయిపోయింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు, యూత్ కూడా థియేటర్లకు వస్తే – బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వాన కురిపించుకోవడం ఖాయం.
ఈ సినిమాతో పాటుగా.. రావణలంక, తీరం అనే మరో రెండు చిత్రాలు ఈ వారం విడుదల కానున్నాయి. కాకపోతే ప్రచారం, స్టార్ కాస్టింగ్, క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటే రొమాంటిక్, వరుడు కావలెను చిత్రాలదే పై చేయి. మరి ఈ రెండింటిలో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకునే సినిమా ఏదో తెలియాలంటే రెండు రోజులు ఆగాలి.