షూటింగులకు కొత్త కళ రాబోతోంది. మళ్లీ బడా స్టార్లు సెట్లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి `ఆచార్య` అక్టోబరు రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నదని సమాచారం. `ఆర్.ఆర్.ఆర్` కీ అప్పుడే ముహూర్తం సెట్ అయ్యింది. `వకీల్ సాబ్` షూటింగ్ ఆదివారం నుంచి మొదలైంది. అయితే.. సెట్లో పవన్ కల్యాణ్ లేడు. పవన్ అక్టోబరు నుంచి డేట్లు ఇచ్చినట్టు చిత్ర యూనిట్ లోని కీలకమైన సభ్యుడు తెలుగు 360కి తెలిపారు. సో.. మూడు పెద్ద సినిమాలూ అక్టోబరులోనే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాయన్నమాట.
ఈ మూడు చిత్రాల్లో `వకీల్ సాబ్` సంక్రాంతికి రాబోతోంది. సంక్రాంతికి అంటే ఇంకా సమయం ఉంది కాబట్టి.. స్లో అండ్ స్టడీగా షూటింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఆర్.ఆర్.ఆర్ ముందు ఓ టార్గెట్ ఉంది. ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. కాబట్టి… ముందు ఆ టీజర్ వదిలి.. ఫ్యాన్స్‌ని ఖుషీ చేయాలి. చిరంజీవి పుట్టిన రోజున `ఆచార్య` మోషన్ పోస్టర్ వచ్చింది. విడుదలకు సైతం సమయం ఉంది. కాబట్టి.. ప్రమోషన్ యాక్టివిటీస్ ఏమీ అవసరం లేదు. అయితే .. ఈ సెట్లో చిరు ఎప్పుడు అడుగుపెడతాడు? చరణ్ ఎప్పుడు వస్తాడు? అన్నదే కీలకం. ముందు చరణ్‌తోనే షూటింగ్ మొదలెడతారని, ఆ తరవాత చిరు బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ మూడు సినిమాలూ అక్టోబరులో మొదలు కాబోతున్నాయి. కరోనా బారీన పడి అల్లాడిన చిత్రసీమకు, సినీ ప్రియులకు ఇంతకంటే మంచి వార్త ఏముంది?