డిల్లీలో శబ్ద, వాయు కాలుష్యం చాలా ప్రమాదకర స్థాయికి పెరిగిపోవడంతో నేటి నుండి సరి-బేసి సంఖ్యలు గల వాహనాలని రోజువిడిచి రోజు మాత్రమే రోడ్లపైకి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. రెండు వారాలపాటు సాగే ఈ ప్రయోగం వలన ఆశించిన ఫలితం కనబడితే, ఈ పద్దతిని శాశ్విత ప్రాతిపాదికన అమలు చేసే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు కూడా ఈ ప్రయోగానికి ఆమోదం తెలిపింది.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక మంచి పని కోసం ఈ ప్రయోగం చేపడుతుంటే దానికి అన్ని విధాల సహకరించక పోగా కాంగ్రెస్, బీజేపీలు ఈ ప్రయోగాన్ని ఎద్దేవా చేస్తున్నాయి. ఇటువంటి మంచిపనికి ముందు నిలిచి విజయవనాథం చేయవలసిన డిల్లీ ప్రభుత్వాదికారులలో 200 మంది ఈరోజు మూకుమ్మడి శలవు పెట్టారు. తమ అనుచరులు ఇద్దరినీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సస్పెండ్ చేసినందుకు నిరసనగా శలవు పెట్టామని వారు చెపుతున్నప్పటికీ దాని వెనుక రాజకీయ కారణాలు విస్పష్టంగా కనబడుతున్నాయి.
ఈ ప్రయోగం వలన డిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నప్పటికీ, చాలా మంది ప్రభుత్వానికి సహకరించడం చాలా అభినందనీయం. రాజకీయ నాయకులు, పార్టీలకు లేని సామాజిక స్పృహ, బాధ్యత డిల్లీ ప్రజలు ప్రదర్శిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహా మంత్రులు అందరూ ఈ సరి-బేసి వాహనాల విధానానికి కట్టుబడి తమ స్వంతః వాహనాలను వదిలిపెట్టి ప్రభుత్వ వాహనాలలో, బస్సులలో, ఆటోలలో తమతమ కార్యాలయాలకు చేరుకొన్నారు. డిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఈరోజు తన కారుకి బదులు తన ద్విచక్రవాహనంపై తన కార్యాలయానికి వచ్చేరు. కొందరు మంత్రులు సైకిళ్ళపై కార్యాలయాలకు వచ్చేరని సమాచారం. డిల్లీ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు ఈవిధంగా తమ మాటలను ఆచరణలో పెట్టి చూపించి, అందరికీ ఆదర్శంగా నిలవడం చాలా అభినందనీయం. అది విజయవంతం అయితే దానిని మిగిలిన రాష్ట్రాలు కూడా పాటించవచ్చును.