ఓటీటీ సినిమాలకి కొన్ని సౌలభ్యాలు వున్నాయి. కమర్షియల్ లెక్కలు అవసరం లేదు. సెన్సార్ వుండదు కాబట్టి థియేటర్లో చెప్పడానికి వీలుపడని కంటెంట్ ని కూడా చెప్పొచ్చు. పాయింట్ లో కొత్తదనం వుంటే చాలు. ఆ పాయింట్ చెప్పడానికి పెద్ద స్టార్ కాస్ట్ కూడా అవసరం పడదు. ఇలా చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలైన ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ వారం ఆహాలో ఒక కొత్త సినిమా వచ్చింది. అదే.. ‘ఓదెల రైల్వేస్టేషన్. సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లే తో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్ నిర్మించిన చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా రివ్యూలోకి వెళితే…
అనుదీప్ (సాయి రోనక్) సివిల్స్ లో టాపర్. ఐఎఎస్ ఆప్షన్ ని వదులుకొని ఐపీఎస్ ని ఎంచుకుంటాడు. ట్రైనింగ్ లో భాగంగా ఓదెల అనే గ్రామానికి వస్తాడు. అదే గ్రామంలో రాధ (హెబ్బా పటేల్) భర్త తిరుపతి (వశిష్ట సింహ) ఇస్త్రీ చేసుకొని జీవితం గడపుతుంటారు. వీరి వివాహం జరిగి చాలా కాలం గడిచినా పిల్లలు కలగరు. తిరుపతికి వున్న లైంగిక సమస్యపై డాక్టర్ ని కూడా సంప్రదిస్తుంది రాధ. ఇదే సమయంలో ఓదెలలో ఒక సంచలనమైన కేసు వెలుగు చూస్తుంది. శోభనం జరిగిన మరుసటి రోజే పెళ్లి కూతురిని ఒక సైకో అతి కితారకంగా అత్యాచారం చేసి చంపేస్తుంటాడు. వరుసగా రెండు హత్యలు జరుగుతాయి. ఈ కేసు అనుదీప్ కి ఒక సవాల్ గా మారుతుంది. మరి ఈ కేసుని అనుదీప్ ఎలా చేధించాడు ? పచ్చటి పల్లెటూరిలో ఇంత దారుణమైన సైకో హత్యలు చేస్తున్న కిల్లర్ ఎవరు ? అసలు శోభనం మరుసటి రోజే అమ్మాయిలని ఎందుకు చంపుతున్నాడు ? అనేది మిగతా కథ.
సంపత్ నంది మంచి కథకుడు. ఆయన ఇచ్చిన కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారి ఒక క్రైమ్ థ్రిల్లర్ ని అందించాడు. వాస్తవ సంఘటనలు ఆధారంగా అని టైటిల్స్ లో వేశారు. అయితే ఇలాంటి సైకో కిల్లింగ్ ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పలేదు కానీ సంపత్ నంది ఎంచుకున్న పాయింట్ మాత్రం టెర్రిఫిక్ గా వుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ్ కథని సంచలనంగా మొదలుపెట్టాడు. ఒక మహిళ ఒకరి తల నరికి పోలీసు స్టేషన్ లో లొంగిపోతుంది. అ మహిళా ఎవరనేది స్పష్టంగా చుపించలేదు. ఆ మహిళ ఎవరు ? తల ఎవరిదనే క్యురీయాసిటీ ప్రేక్షకుడిలో కలుగుతుంది. మొదటి హత్య జరిగిన తర్వాత సైకో ఎవరని ప్రేక్షకుడు అలోచించడం మొదలుపెడతాడు. ఈ దశలో కొన్ని పాత్రల అనుమానం వచ్చేలా నడిపిన సీన్లు పాతగానే వున్నా.. అసలు సైకో కిల్లర్ ఎవరనే ఎక్సయిట్మెంట్ మాత్రం కలిగించారు.
ఎప్పుడైతే ప్రెసిడెంట్ కూతురు హత్య జరుగుతుందో.. అప్పుడే సినిమా క్లైమాక్స్ కి వచ్చేసినట్లనిపిస్తుంది. అయితే అసలు సైకో ఇంకా దొరకలేదని వచ్చే ట్విస్ట్ .. దాని వెనుకున్న డ్రామా సైకో కిల్లర్ గస్సింగ్ ని కొనసాగించింది. ఇలాంటి సినిమాల్లో సైకో ఆడే మైండ్ గేమ్ కూడా చాలా ముఖ్యం. కానీ ఇందులో అలాంటి గేమ్ ఏమీ కనిపించదు. సైకోకి పెద్ద తెలివితేటలేమీ వుండవు. అటు పోలీసులు కూడా సైకోకి ఛాన్సులు ఇస్తూ పొతుంటారు. ఇందులో పోలీసుల విచారణ చూస్తే.. ఎంత పల్లెటూరైన మరీ ఇంత తేలికగా విచారణ చేస్తారా ? అనిపిస్తుంది.
ఇలాంటి సినిమాలకి అసలు సైకో రివిల్ అయినపుడు ప్రేక్షకుడు పొందే థ్రిల్ చాలా ముఖ్యం. ఇందులో మాత్రం ఆ థ్రిల్ మిస్ అయ్యింది. సైకో కిల్లింగ్ కి అతడు ఇచ్చుకున్న కారణం కూడా అసహజంగా వుంటుంది. ఎప్పుడైతే రాధకి సైకో కిల్లర్ గురించి ఒక లీడ్ దొరికిందో అప్పుడే ముగింపు అర్ధమైపోతుంది. ఈ కథకు బయలాజికల్ జస్టిఫీకేషన్ ఇవ్వాలని ఒక లైంగిక రుగ్మతని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. అయితే సైకో కిల్లర్ కథని ఆ పాయింట్ అంతగా సమర్ధించదు.
హెబ్బాపటేల్ తొలిసారి డీగ్లామర్ రోల్ లో కనిపించింది. క్లైమాక్స్ లో హెబ్బా నటన ఆకట్టుకుంటుంది. హెబ్బా భర్తగా చేసిన వశిష్ట సింహ తన పాత్రకి న్యాయం చేశాడు. ట్రైనీ ఐపీఎస్ గా సాయి రోనక్ పాత్ర ఆకట్టుకుంటుంది. ప్రెసిడెంట్, హెబ్బ మరిది, వూర్లో ఫోటోగ్రఫీ చేసిన పాత్రలలో కనిపించే నటులు పరిధిమేర నటించారు. పరిమిత బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. అయితే అనూప్ రూబెన్స్ మ్యూజిక్, సౌందర్ రాజన్ డీవోపీ సినిమాకి ప్లస్ అయ్యాయి. అలాగే నిడివి తక్కువ వున్న సినిమా ఇది. అదీ కూడా ఒక ప్లస్ పాయింట్.
సినిమా ఓటీటీలో వుంది కాబట్టి సమయం కుదిరినప్పుడు ఒకసారి చూడొచ్చు. అన్నట్టు ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా వుందని చివర్లో హింట్ ఇచ్చారు. అయితే ఈ కథలో సైకో దొరికాడు. కేసు క్లోజ్ అయ్యింది. పార్ట్ 2 అంటే మరో సైకో కిల్లర్ కథని చూపించాలి.