Odela2 Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్’. అప్పట్లో సైలెంట్ హిట్. హెబ్బా పటేల్, సంపత్‌నంది తప్ప ఎవ్వరూ తెలీదు. వాళ్లిద్దరే ‘ఓదెల రైల్వే స్టేషన్’కు ప్రధాన ఆకర్షణ. ‘ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడాలి’ అనే ఫీలింగ్ తీసుకొచ్చిన కంటెంట్ అది. ఆ స్ఫూర్తితోనే `ఓదెల 2` తీశారు. ఈసారి ఓటీటీకి కాకుండా థియేటర్లో సినిమా విడుదల చేశారు. ‘ఓదెల రైల్వే స్టేషన్`ని ఎంత సింపుల్ గా లాగించేశారో, ‘ఓదెల 2’ని అంత భారీగా తీసే ప్రయత్నం చేశారు. ఈసారి తమన్నా యాడ్ అయ్యింది. రచన, దర్శకత్వ పర్యవేక్షణ సంపత్నందినే చూసుకొన్నారు. టీజర్, ట్రైలర్లలో విజువల్స్ మోత మోగించాయి. మరి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా వుంది? ‘ఓదెల 2’ చూడాల్సిన సినిమానేనా?
కథలోకి వెళ్దాం. సరిగ్గా ‘ఓదెల రైల్వే స్టేషన్’ ఎక్కడైతే ఆగిందో, అక్కడ ఈ సినిమా మొదలవుతుంది. తిరుపతి ఓ కామ పిశాచి. ఊర్లో కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని వదలడు. ఫస్ట్ నైట్ రోజే.. వాళ్లని అనుభవించి చంపేస్తాడు. అలాంటి తిరుపతిని.. అతని భార్యే (హెబ్బా పటేల్) చంపేస్తుంది. తిరుపతి చనిపోయినా.. ఊరి వాళ్లకు తనపై కోపం తగ్గదు. అందుకే సమాధి శిక్ష విధిస్తారు. కపాల మోక్షం కలగకుండా శవాన్ని సైతం ఇబ్బందికి గురి చేస్తారు. దాంతో తిరుపతి ఆత్మ ఊరి ప్రజలపై మరింత కక్ష పెంచుకొంటుంది. ఓ దుర్ముహార్తాన.. ఆత్మ ఊరిలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఓదెల ప్రజలకు కంటిమీద కునుకు ఉండదు. వరుస హత్యలు జరుగుతుంటాయి. తిరుపతి ఆత్మ విశ్వరూపం దాలుస్తుంది. ఈ ఆత్మని ఆధీనంలోకి తీసుకురావడానికి ఓ శివ భక్తురాలు (తమన్నా) ఓదెలలో అడుగుపెడుతుంది. ఆ తరవాత ఏం జరిగిందన్నది కథ.
దైవ శక్తికీ, దుష్ట శక్తికీ మధ్య జరిగే పోరాటం ఈ కథ. ఈ ఫార్మెట్లో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎన్నొచ్చినా ఈ ఫార్ములాకు గిరాకీ తగ్గదు. ‘ఓదెల 2’ ఆలోచన పురుడు పోసుకోవడానికి కారణం కూడా ఇదే. `ఓదెల రైల్వేస్టేషన్` ఫ్రాంచైజీ కంటిన్యూ చేయడానికి కావాల్సిన సరంజామా మొత్తం ఈ కథలో వుంది. దానికి తమన్నా స్టార్డమ్, విజువల్స్ తోడయ్యాయి. తిరుపతి శవాన్ని సమాధి శిక్ష చేయడం దగ్గర్నుంచి ఈ కథ మొదలవుతుంది. తిరుపతి ఆత్మ ఊరి ప్రజలపై కక్ష పెంచుకొందని, ఊరు వినాశనం అవ్వకతప్పన్న హింట్ ముందే ఇచ్చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు థ్రిల్ పంచుతాయి. అయితే ప్రతీ మర్డర్ ఒకే ఫార్మెట్ లో డిజైన్ చేయడం వల్ల ఆ థ్రిల్ తగ్గుతూ పోతుంది. తిరుపతిని మళ్లీ కామిస్ట్ గానే చూపించడం వల్ల.. ‘ఓదెల రైల్వేస్టేషన్’ చూసినట్టే ఉంటుంది. ఓదెల సింపుల్ గా సాగే కథ. అందులో ఇలాంటి అతీంద్రియ శక్తులు ఉండవు. హత్యలు ఎవరు చేస్తున్నారు? అనేది కనుక్కోవడమే కథ. అయినా థ్రిల్ మిస్సవ్వలేదు. పార్ట్ 2లో తిరుపతే అంతా చేస్తున్నాడని తెలుస్తుంది. అయినా థ్రిల్ కలిగించగలిగాలి. ఈ విషయంలో దర్శకుడు కొన్ని చోట్ల మాత్రమే సక్సెస్ అయ్యాడు. తమన్నా పాత్ర ఇంట్రవెల్ బ్యాంగ్ వరకూ రాదు. తమన్నా వస్తుందని, ఈ ఆత్మని ఆధీనంలోకి తెచ్చుకొంటుందని ప్రేక్షకుడికి అర్థం అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ పాత్రని వీలైనంత త్వరగా ప్రవేశ పెట్టాల్సింది. ఇంట్రవెల్ బ్యాంగ్ వరకూ తమన్నా ఎంట్రీ ఉండదు. అక్కడ ఓ శివభక్తురాల్ని, మాస్ హీరోలా కావల్సిన ఎలివేషన్స్ తో ఎంటర్ చేశారు.
ద్వితీయార్థంలో చాలా చోట్ల విజువల్ పరంగా ఈ సినిమా మార్కులు తెచ్చుకొంటుంది. పశుపతి పంచభూతాల రూపాలు సంతరించుకొనే సీన్ బాగా డిజైన్ చేశారు. విజువల్ గా బాగా తీశారు. క్లైమాక్స్ లో శివుని రాక.. గూజ్బమ్స్ తెచ్చే మూమెంట్. అయితే ఈమధ్యలో సాగే డ్రామా అంతగా అతకలేదు. తిరుపతి చూపు మరల్చడానికి భార్యని సమాధి దగ్గరకు పంపడం.. క్లీ షేగా అనిపించే విషయం. ఆ సీన్ ఎందుకో పంటికింద రాయిలా తగులుతుంది.
అరుంధతి దగ్గర్నుంచి నిన్నా మొన్న వచ్చి అఖండ వరకూ చాలా సినిమాల రిఫరెన్స్‌లు ఈ సినిమాలో కనిపిస్తాయి. వాటిని దర్శకుడు బాగా బ్లెండ్ చేయగలిగాడు. తిరుపతి పాత్ర అరుంధతిలోని పశుపతి పాత్రని పోలి ఉంటుంది. కొన్ని డైలాగులు కూడా మ్యాచ్ అయ్యాయి. హిందుత్వం, మన దేవుళ్లు, వాళ్ల మహిమల గురించి చెప్పే సినిమాలు, కథలు, సన్నివేశాలు ఈమధ్య తెగ నచ్చుతున్నాయి. ఆ లెక్కన చూస్తే `ఓదెల 2` కరెక్ట్ ట్రాక్‌లోనే ఉన్నట్టు. పంచాక్షరి మంత్రం గురించి ఓ ముస్లిం ఫకీరు చెప్పడం బాగుంది. కాకపోతే మజిద్లోని బీరువాలో `కపాల మోక్షం` పుస్తకం ఉండడం చాలా టూమచ్. ఇస్లాం ఏమాత్రం నమ్మని సిద్ధాంతం అది. పరమశివుడే నేరుగా దిగి వచ్చి ఓ దుష్ట శక్తిని అంతరించడం విజువల్‌గా మంచి మూమెంట్. కానీ శివుడు దిగి రావాల్సినంత పెద్ద ఆపదేం కాదు. శివుడే దిగిరావాలంటే తిరుపతి పాత్రని ఇంకా బీభత్సంగా చూపించాలి. ఇంకా శక్తిమంతుడ్ని చేయాలి. ఇది సరిపోదు.
తమన్నాని ఈ తరహా పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. తను కూడా హుందాగా నటించింది. ఆమె వేష భాషలు బాగున్నాయి. పాత్రకు కట్టుబడి నటించింది. హెబ్బా పటేల్ ది అతిథి పాత్ర అనుకోవాలి. తిరుపతిగా కనిపించిన వశిష్ట సింహా బాగా చేశాడు. తన పాత్ర ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. మురళీ శర్మ ఓ కీలక పాత్రలో కనిపించారు.
టెక్నికల్ గా సినిమాను మంచి క్వాలిటీలో తీశారు. కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా ఆర్.ఆర్… సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆర్.ఆర్ లో వినిపించిన థీమ్స్ బాగున్నాయి. సన్నివేశంలో థ్రిల్ లేని చోట కూడా ఆర్.ఆర్ తో ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చారు. రూ.20 కోట్లతో తీసిన సినిమా ఇది. విజువల్స్ మాత్రం అలా అనిపించవు. ఇంకా కాస్ట్లీ సినిమాలా ఉంది. మీడియం బడ్జెట్లో ఇంత నాణ్యమైన సినిమా తీయడం గొప్ప విషయమే. సంపత్‌నంది ఈ సినిమాకు కర్త కర్మ క్రియ. ఓదెల ఫ్రాంచైజీని ఆయన బాగా పట్టుకొన్నారు. కొన్ని సీన్స్ థియేటర్లో గూజ్బమ్స్ తెప్పిస్తాయి. అయితే ఈ ఎఫెక్ట్ బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించడానికి సరిపోతుందా? అనేది ప్రేక్షకులే చెప్పాలి.
తెలుగు360 రేటింగ్: 2.5/5