ఓవైపు ఐపీఎల్, మరోవైపు కొత్త సినిమాల సందడి. ఈ వేసవి అంతా ఇలానే ఉండబోతోంది. ఈవారం కూడా రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 17న ‘ఓదెల 2’ రిలీజ్ అవుతోంటే 18న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ సినిమా రాబోతోంది.
కరోనా సమయంలో, ఓటీటీ ప్రేక్షకుల్ని రంజింపజేయడమే లక్ష్యంగా ‘ఓదెల రైల్వే స్టేషన్’ని రూపొందించారు. ఓటీటీ తెరపై ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఓదెల 2’ తయారైంది. సంపత్‌నంది ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ. తమన్నా కథానాయికగా నటించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ మధ్య పోరాటం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుందని సంపత్‌నంది నమ్మకంగా చెబుతున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకొంది. తమన్నాకున్న క్రేజ్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందన్న ధీమా దర్శక నిర్మాతల్లో కనిపిస్తోంది.
కల్యాణ్ రామ్ – విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’. టైటిల్ ని బట్టి చెప్పేయొచ్చు.. ఇది ఏ తరహా చిత్రమో. తల్లీకొడుకుల అనుబంధానికి పెద్ద పీట వేసిన కథ ఇది. ‘సరిలేరు నీకెవ్వరు’ తరవాత విజయశాంతి నటించిన సినిమా కావడంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. టీజర్, ట్రైలర్లో యాక్షన్‌ని బాగా దట్టించారు. క్లైమాక్స్ అదిరిపోతుందని, కొన్ని సన్నివేశాలు హృదయాన్ని బరువెక్కిస్తాయని, తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా పండిందని ఎన్టీఆర్ సైతం కితాబు ఇచ్చేశారు. అన్ని కమర్షియల్ అంశాలూ రంగరించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
ఈమధ్య ప్రతీవారం ఏదో ఓ సినిమా రీ రిలీజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 18న ‘ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మాస్, యాక్షన్ కథలు రీ రిలీజ్ అవ్వడం మామూలే. ఇలాంటి సమయంలో ఓ ఫీల్ గుడ్ సినిమాని మళ్లీ రిలీజ్ చేయడం వింతగా కనిపిస్తోంది.