కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన రాకపోయినప్పటికీ అఖిల పక్ష భేటీ లో వెలువడిన అభిప్రాయాల మేరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రమేయం లేకుండా ఒడిశా రాష్ట్రం లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది.
ఏప్రిల్ 15వ తేదీన ముగియాల్సిన లాక్ డౌన్ ని ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలను జూన్ 17వ తేదీ వరకు మూసి ఉంచాల్సిందిగా ప్రభుత్వం ఆజ్ఞాపించింది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా, దేశంలో లాక్ డౌన్ పొడిగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఒడిశా రాష్ట్ర బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా పయనించే అవకాశం కనిపిస్తోంది.
అయితే విడివిడిగా రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు కాకుండా, దేశం మొత్తం లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఆదివారం లోపే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.