రాష్ట్రానికో రాజకీయం అన్నట్టుగా భాజపా తీరు కనిపిస్తోంది..! విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇన్నాళ్లూ కేంద్రం చెప్పిన అభ్యంతరమేంటీ… ఒడిశా ఒప్పుకోవడం లేదనే కదా! వారికి అభ్యంతరాలున్నాయీ, మాట్లాడుతున్నామనే చెప్తూ వచ్చారు. కానీ, అసలు విషయం ఏంటంటే… ఏపీ రైల్వే జోన్ విషయమై ఒడిశా నేతలతో భాజపా ఇంతవరకూ చర్చించేలేదట..! ఇదే విషయాన్ని కొంతమంది ఒడిశా నేతలు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా రైల్వే జోన్ విషయమై తమకు ఎలాంటి అభ్యంతరాలేవనీ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే చాలానే విషయాన్ని కేంద్రానికి ఎప్పుడో స్పష్టంగా చెప్పామన్నారు. విశాఖ రైల్వేజోన్ విషయమై ఏపీలో తమని బూచిగా భాజపా చూపిస్తోందన్న విషయమే తమకు తెలియదంటూ కొంతమంది ఎంపీలు వాపోయారు. అంతేకాదు, భాజపాతో జాగ్రత్తగా ఉండాలనీ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ నేతలకి వారు సలహా ఇచ్చారట.
అంతేకాదు, ఏపీలో రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తమతో చెప్పారని బీజేడీ ఎంపీలు అంటున్నారు. ఇదే పీయూష్ గోయల్.. విశాఖ జోన్ విషయమై విలేకరులతో మాట్లాడుతూ ఇంకా పరిశీలనలో ఉందని చెప్పారు. నిబంధనలన్నీ పరిశీలిస్తున్నామనీ, పక్క రాష్ట్రాల నుంచి వ్యక్తమౌతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా నిన్న ఢిల్లీలో ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని విలేకరులు ప్రశ్నించేలోగా… ఆయన ప్రెస్ మీట్ ముగించి వెళ్లిపోయారు.
దీంతో చాలా స్పష్టంగా అర్థమౌతున్న విషయం ఏంటంటే… రాష్ట్రానికో రాజకీయం భాజపా చేస్తోందని..! రైల్వే జోన్ పై ఒడిశా అభ్యంతరమని ఆంధ్రాలో చెప్పినప్పుడు.. ఆ రాష్ట్రంతో చర్చలు జరపాలి కదా..! కానీ, ఆ ప్రయత్నమే చేయకుండా ఇంకా పరిశీలిస్తున్నామని ఆంధ్రాకి చెప్పడం అనేది మభ్యపెట్టడం కాక ఇంకేమౌతుంది..? ప్రత్యేక హోదా విషయంలోనూ ఇలానే… ఏమాత్రం సంబంధం లేని 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపించారు. కానీ, ఆ నివేదికలో హోదా ఇవ్వొద్దనే ప్రస్థావనే లేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులే తేల్చి చెప్పారు. దీంతో కేంద్రం అసలు రంగు బయటపడింది. ఆంధ్రా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్పే భాజపా నేతలు… ఆ ప్రయత్నమే చేయడం లేదన్నది మరోసారి స్పష్టమౌతోంది.