వైసీపీకి వ్యతిరేకంగా ఏం జరిగినా.. టీడీపీ అని.. అన్ని వ్యవస్థల్లో టీడీపీ నేతలున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. అనుకూలంగా జరిగితే పర్వాలేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ విషయంలో … ఒడిషాను తీసుకువస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రను ఒడిషా చేసిందని మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి కోరస్లో వినిపించడం ప్రారంభించారు. ఒడిశా వ్యక్తి కేంద్ర మంత్రి కావడంతోనే స్టీల్ ప్లాంట్‌పై పెద్ద కుట్ర జరుగుతోందని …విశాఖలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చేశారు. ఒడిశా, ఛత్తీస్గడ్ తరిమేసిన పోస్కోను ఏపీపై రుద్దాలని చూస్తున్నారని ఆయన అంటున్నారు.
మరి పోస్కో ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ… స్టీల్ ప్లాంట్ సందర్శన.. ఒప్పందం జరగడం వంటి అంశాలపై అవంతి తనదైన వాదన వినిపిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు సీఎంను కలవడం సహజమని చెప్పుకొస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం లాలూచీ పడలేదని నమ్మాలని అంటున్నారు. అదే సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి కూడా.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఒడిశా నేతలు, కేంద్ర బ్యూరోక్రసీ పెత్తనం చేస్తోందని ఆరోపించారు. మొత్తానికి కేంద్ర ఉక్కు మంత్రిగా ఒడిషాకు చెందిన దేవేంద్ర ప్రధాన్ ఉండటంతో… వైసీపీకి మంచి ఆయుధం దొరికినట్లయింది. దాని ఆధారంగా స్టీల్ ప్లాంట్‌లో ఒడిషా వాళ్లే ఎక్కువగా ఉన్నారంటున్నారు.
తమకేమీ తెలియదంటున్న ఏపీ ప్రభుత్వాన్ని మాత్రం ప్రజలు నమ్మడం లేదు. అంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందని… అనేకానేక ఆధారాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ నేతలు.. సరికొత్త వాదనను తీసుకు వచ్చారు. ఏం జరిగినా టీడీపీపై నెట్టేసి రాజకీయం చేస్తూ వచ్చిన స్ట్రాటజీని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో చేయలేరు కాబట్టి.. ఒడిషాపైకి నెట్టేస్తున్నారు. ఇలాంటి రాజకీయం చేయడం లో వైసీపీ నేతలకు తిరుగు ఉండదు. వాళ్లను ఎవరూ అధిగమించలేరు.