పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పై ఉన్న ప్రధాన విమర్శ ఏమిటంటే, ఈ పార్టీలోకి పెద్ద పెద్ద లీడర్లు చేరలేదు అని. అలాగే ఇటు టీడీపీ కానీ అటు వైఎస్సార్ సీపీ గాని జనసేన పార్టీకి లీడర్లు లేరు క్యాడర్ లేదు అంటూ పలుమార్లు ఆ పార్టీని తక్కువ చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏమో, ప్రజారాజ్యం సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు దృష్ట్యా పార్టీలోకి లీడర్లను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జనసేన పార్టీలో చేరిన నాయకులో జనాలకు బాగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాదెండ్ల మనోహర్, రావెల కిషోర్ బాబు, బాలరాజు, అశోక్ రాజా, రాపాక వరప్రసాద్ లాగా గతంలో ఒకసారైనా ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు పట్టుమని పదిమంది కూడా జనసేన లో లేరు. వీటితోపాటు, ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గా ఎన్నిక కాకపోయినప్పటికీ, నియోజకవర్గ స్థాయిలో ప్రజలలో గట్టిగా తిరుగుతున్న నాయకులు ఇంకొంత మంది ఉన్నారు. అయితే జనసేన లో ఉన్న ఈ కొంతమంది లీడర్లను కూడా ఆకర్షించే ప్రయత్నాలు అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ సీపీ చేస్తున్నాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.
గేదెల శ్రీను అనే నేత రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా తెలియకపోయినప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ తరఫున గట్టిగా పని చేస్తున్నారు. తితిలి తుఫాను సమయంలో సొంత డబ్బులతో ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడంతో ఈయనపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా శ్రీకాకుళంలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి, వందల కోట్ల వ్యాపారాన్ని సొంత కష్టంతో స్థాపించిన ఈయనకు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. పైగా వ్యాపారం తో పాటు చాలాకాలంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం, ఆ తర్వాత జనసేనలో చేరడం జరిగిపోయాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఎంపీ టికెట్ గేదెల శ్రీనుకు జనసేన నుండి దాదాపు ఖాయమని వార్తలు వస్తున్న సమయంలో ఇటు వైఎస్ఆర్ సీపీ నుండి అటు టీడీపీ నుండి ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలహీనంగా ఉన్న వైఎస్ఆర్ సీపీ, శ్రీను ని తమ పార్టీలోకి తీసుకురావడానికి చాలా గట్టిగానే ప్రయత్నించిందని వార్తలు వస్తున్నాయి. టీడీపీ వైపు నుండి కూడా పార్టీలో చేరమని ఆహ్వానం వచ్చినప్పటికీ గేదెల శ్రీను మాత్రం ఆ రెండు పార్టీల ఆఫర్లను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇక టీడీపీలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఉద్వాసనకు గురైన రావెల కిషోర్ బాబుది కూడా ఇదే పరిస్థితి. అధికార పార్టీలో ఉండి కూడా, స్పీకర్ ఫార్మాట్ లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వచ్చి జనసేనలో చేరిన రావెల కిషోర్ బాబు కి కూడా వైఎస్సార్సీపీ నుండి ఆహ్వానం అందింది. పార్టీలోకి వచ్చినట్లయితే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాను జనసేన లోనే ఉంటానని వేరే ఇతర పార్టీలో చేరడం లేదని ఇటీవల రావెల కిషోర్ బాబు బహిరంగంగా ప్రకటించడం వెనుక కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ కి సైతం వైఎస్ఆర్ సీపీ నుండి ఆహ్వానం వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటు వైఎస్సార్సీపీ కానీ టీడీపీ కానీ ఇప్పటికే అనేకమంది లీడర్లతో ఓవర్ ఫ్లో అవుతున్నాయి. దానికి విరుద్ధంగా జనసేనలో పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్న ఒక పది మంది నాయకులు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. అయితే నాయకులతో ఓవర్ ఫ్లో అవుతున్న వైఎస్సార్సీపీ లాంటి పార్టీలు కూడా జనసేనలో ఉన్న ఆ కొద్ది మంది లీడర్లను లాగడానికి ప్రయత్నించడానికి కారణాలు ఏంటి అన్నది విశ్లేషకులకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న లీడర్లు గెలవలేరనే ఉద్దేశంతోనే ఇలా జనసేన నాయకులను లాగుతున్నారేమోనని జనసేన అభిమానులు అంటున్నారు.
మరి జనసేన నాయకులలో ఎంతమంది ఈ ఆఫర్లకు లొంగుతారు ఎంతమంది జనసేన తోనే కొనసాగుతారు అన్నది వేచి చూడాలి.