రాముడి కంటే రామబాణం గొప్పదని ఓ సామెత. రాముడితో రామబాణం యుద్ధంలో తలపెడితే ఎవరు నెగ్గారు? పురాణాల్లో ఏదో రాశారనుకోండి. అది పక్కన పెట్టి… హీరోతో సదరు హీరో పరిచయం చేసిన దర్శకుడు తలపడితే ఎవరు విజయం సాధిస్తారు? మే మంత్ లాస్ట్ వీకెండ్ తెలుస్తుంది. క్లారిటీగా చెప్పాలంటే… మే 25న నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆఫీసర్’ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజుకు ఒక్క రోజు ముందు రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నెల టికెట్టు’ను విడుదల చేయాలనుకుంటున్నట్టు నిర్మాతలు ఈ రోజు ప్రకటించారు. అంటే… మే లాస్ట్ వీకెండ్ థియేటర్లలో నాగార్జున vs నాగార్జున దర్శకుడు తప్పదన్నమాట!
నాగార్జున వర్మను నమ్ముకుంటే… రవితేజ నాగార్జున దర్శకుణ్ణి నమ్మాడు. ‘నెల టికెట్టు’కి ముందు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన రెండు సినిమాలనూ నిర్మించింది నాగార్జునే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో కళ్యాణ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేసిన నాగార్జున, తర్వాత ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ను నిర్మించారు. రెండూ మంచి విజయాలు సాధించాయి. కళ్యాణ్ కృష్ణ మూడో సినిమా కూడా నాగార్జున అన్నపూర్ణ సంస్థలోనో లేదా వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలోనో చేయాలి. కథ కుదరకపోవడంతో రవితేజతో ‘నెల టికెట్టు’ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వర్మ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కళ్యాణ్ కృష్ణ రెండూ వినోదంతో మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ నేపథ్యంలో ‘ఆఫీసర్’, ‘నెల టికెట్టు’ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. కథ విషయంలో, మేకింగ్ వవిషయంలో నాగార్జున రాజీ పడడు కాబట్టి ‘ఆఫీసర్’ మీద ప్రేక్షకులకు హోప్స్ వున్నాయి. లేదంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో వార్ వన్ సైడ్ అయ్యేది.