హైదరాబాద్ … ఎక్కడ పడితే అక్కడ హోటల్స్. అనుమతి ఉన్నవి ఏవో… లేనివి ఏవో… ఎవ్వరికీ తెలియదు. ఏ గల్లీ చూసినా కర్రీ పాయింటో, టిఫిన్ సెంటరో కామన్.
అయితే, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో చిన్న హోటల్స్ నుండి పిస్తా హౌజ్, ప్యారడైజ్, వివాహ భోజనంబు వంటి పెద్ద హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. అన్నింటిని ఫోటోలతో సహా ట్విట్టర్ లో పెట్టేస్తున్నారు.
చాలా మంది ఈ వింగ్ ఉంది అనే విషయమే మర్చిపోయారు. దాడుల సమాచారం పెట్టగానే… వావ్, సూపర్, మా ఏరియాలో కూడా చెకింగ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్స్ వస్తున్నాయి. అయితే, టాప్ రెస్టారెంట్స్ పై కూడా దాడులు జరిగితే ఎన్ని ఒత్తిడులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, అవేవీ ఆ అధికారిని ఆపటం లేదు. ఆయనే ఐఏఎస్ అధికారి కర్ణన్.
అవును… తన టీంలో ఎవరి ఫోన్ నెంబర్లు ఇతరులకు తెలియవు. ప్రభుత్వం నుండి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. మంత్రి దామోదర నుండి ఎలాంటి ప్రెజర్స్ రావు. ఇంకేముంది… ఆ అధికారి తన టీంతో రఫ్పాడించేస్తున్నారు. ఎంతలా అంటే చెకింగ్ కు ఎవరైనా వస్తారు జాగ్రత్త అని హోటల్స్ యాజమాన్యాలు జాగ్రత్తపడేంత.
ఈ కర్ణన్ అనే అధికారి చాలా రోజుల నుండి తెలంగాణ క్యాడర్ లోనే ఉన్నా… ఫ్రీడమ్ ఉంటే ఏం చేయవచ్చో చేసి చూపిస్తున్నారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్స్ ర్యాంకు సాధించారు. తమిళనాడుకు చెందిన ఈ అధికారి తల్లి సబ్ రిజిస్ట్రారర్ గా పనిచేయగా, తండ్రి లైబ్రేరియన్. ఈయన సతీమణి ప్రియాంక కూడా తెలంగాణ అధికారే. ప్రస్తుతం సూర్యాపేట అడిషనల్ కలెక్టర్.