తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత ముఖ్యులు. మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్.. ఉద్యమ సమయంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ను పెట్టారు. ఆయన మంత్రి అయ్యాక తన బాధ్యతల్ని మమతకు ఇచ్చారు. ఆయన కూడా అంతకు ముందు మున్సిపల్ కమిషనర్గా ఉండేవారు. ఇప్పుడు మమత కూడా మున్సిపల్ కమిషనరే. సుదీర్ఘంగా కూకట్ పల్లిలోనే పని చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఎల్బీనగర్కు బదిలీ చేశారు. కానీ సాయంత్రానికి ఉత్తర్వులు మారిపోయాయి. ఆమెను కూకట్ పల్లిలోనే కొనసాగించాలని ఉత్తర్వులు మార్చేశారు.
అవినీతి ఆరోపణలు విపరీతంగా ఉండటం.. సుదీర్ఘకాలంగా పని చేస్తూండటంతో గ్రేటర్ కమిషనర్.. ఐదుగురు జోనల్ కమిషనర్లను ఒక్క సారిగా బదిలీ చేశారు. ఇందులో మమత కూడా ఉన్నారు. వెంటనే ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రభుత్వ పెద్దలపైనే ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా మమత బదిలీ అగిపోయింది. మిగిలిన వారివి యధావిధిగా బదిలీలు జరిగిపోయాయి. వారికి అంత పలుకుబడి లేదు. నిజానికి మమతకు పదోన్నతి ఇవ్వడంపైనా వివాదం ఉంది. ఆమె కంటే 22 మంది సీనియర్లు ఉన్నప్పటికీ జోనల్ కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చారు.
ఉద్యోగ సంఘాల నేతగా ఉండి..పలుకుబడితో మంచి పోస్టింగ్ పొంతున్న మమతపై ఇతర అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే ఏండ్ల నుంచి చాలా మంది అధికారులు ఎలాంటి విధులు లేకుండా ఖాళీగా ఉన్నారు. వారెవరికీ పోస్టింగ్ దక్కడం లేదు. ప్రధాన కార్యాలయంలో చాలా మంది పనిలేని విధుల్లో ఉన్నా.. వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. మమత వంటి వారు అధికారం చెలాయిస్తున్నారు. ఉద్యోగ సంఘం నేతల తమ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఉద్యోగుల కోసం కాదన్న అసంతృప్తి తెలంగాణ ఉద్యోగుల్లో పెరిగిపోతోంది.