కూకట్ పల్లిని అంటి పెట్టుకుని అది తన సామ్రాజ్యం అన్నట్లుగా చెలరేగిపోయిన టీజీవో రాష్ట అధ్యక్షురాలు వి. మమతపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. టీజీఓ గౌరవాధ్యక్షుడుగా చెప్పుకునే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండతో ఆమె కూకట్ పల్లిలో తిష్ట వేశారు. ఆమెను కదిలించడం ఎవరి వల్లా కాలేదు. ప్రస్తుతం ఆమెను విధులు.. నిధులు ఉండని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమించారు. ఉద్యోగ సంఘం నేతగా మమత బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలపై కథలు కథలుగా ఉద్యోగులు చెప్పుకుంటారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత ముఖ్యులు. మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్.. ఉద్యమ సమయంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ను పెట్టారు. ఆయన మంత్రి అయ్యాక తన బాధ్యతల్ని మమతకు ఇచ్చారు. ఆయన కూడా అంతకు ముందు మున్సిపల్ కమిషనర్గా ఉండేవారు. ఇప్పుడు మమత కూడా మున్సిపల్ కమిషనరే. సుదీర్ఘంగా కూకట్ పల్లిలోనే పని చేశారు. ఆ మధ్య ఓసారి ఎల్బీనగర్కు బదిలీ చేశారు. కానీ సాయంత్రానికి ఉత్తర్వులు మారిపోయాయి. ఆమెను కూకట్ పల్లిలోనే కొనసాగించాలని ఉత్తర్వులు మార్చేశారు.
అవినీతి ఆరోపణలు విపరీతంగా ఉండటం.. సుదీర్ఘకాలంగా పని చేస్తున్నందున మార్చారు. కానీ తాను ఎంత పవర్ ఫుల్లో మమత అప్పుడు చూూపించారు. గంటల్లోనే మమత బదిలీ అగిపోయింది. నిజానికి మమతకు పదోన్నతి ఇవ్వడంపైనా వివాదం ఉంది. ఆమె కంటే 22 మంది సీనియర్లు ఉన్నప్పటికీ జోనల్ కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఇవన్నీ బయటకు తీస్తారో లేదో కానీ.. ఇప్పటికైతే ఆమెను పక్కన పెట్టేశారు. మిగిలిన వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొసమెరుపేమిటంటే… ప్రభుత్వం మారగానే..సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందించి వచ్చారు కూడా.