నాగార్జున – రాంగోపాల్ వర్మ ‘ఆఫీసర్’ వాయిదా పడిందని సమాచారం. ఈనెల 25న విడుదల కావాల్సిన సినిమా ఇది. ఆ సమయానికి ‘ఆఫీసర్’ రావడం అనుమానమే అని ముందు నుంచీ వార్తలు అందుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. ఓ వారం ఆలస్యంగా ఈ సినిమా విడుదల కానున్నదని తెలుస్తోంది. అఫీషియల్ డేట్.. ఈరోజు సాయింత్రానికల్లా బయటకు రావొచ్చు. మరోవైపు `ఆఫీసర్` ప్రమోషన్లకు రంగం సిద్ధం చేశాడు. ఈరోజు దిన పత్రికలకు వర్మ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు. రేపటి నుంచి టీవీ ఛానళ్లలోనూ వర్మ కనిపించబోతున్నాడు. వర్మ మీడియా ముందుకొస్తే.. చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇటీవల చెలరేగిన శ్రీరెడ్డి ఇష్యూ దగ్గర నుంచి… అల్లు అరవింద్ ప్రెస్ మీట్లో వర్మపై నిప్పులు చెరగడం వరకూ.. చాలా అంశాలు వర్మ ప్రస్తావించే అవకాశం ఉంది. ఇవన్నీ వర్మ తన సినిమా పబ్లిసిటీకి ఎంత వరకూ వాడుకుంటాడన్నది ప్రధానం. ‘ఆఫీసర్’ సినిమాపై ఇప్పటి వరకూ ఎలాంటి క్రేజ్ లేదు. టీజర్లు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ని తీసుకురాలేకపోతున్నాయి. కనీసం వర్మ మాటలైనా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తాయేమో చూడాలి.