ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలనలో ఎక్కడా తాను కానీ తన పార్టీ నేతలు కానీ ఇరుక్కోకుండా… తమ మాటలు విని .. గుడ్డిగా వ్యవహరించిన నేతలే నిండా మునిగిపోయేలా… జగన్ రెడ్డి భారీ స్కెచ్ వేసి అమలు చేస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడే కొంత మంది బలి అయిపోతున్నారు. ఇక అధికారం పోతే.. ప్రభుత్వం చెప్పిన అడ్డగోలు పనులన్నింటినీ చేసి ప్రజల్ని రాచి రంపాన పెట్టిన వారికి ఎంత గడ్డు పరిస్థితులు ఉంటాయో చెప్పడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
అనంతపురం జిల్లా ఉరవకొండ ఓట్ల అవకతవకల విషయంలో ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు పడింది. ఓట్ల విషయంలో వారు వైసీపీ నేతలతో కలిసి చేసిన నిర్వాకాలే ఇందుకు కారణం. ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ విచారణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ వైపు టీడీపీ పూర్తి అధారాలతో పాటు… మీడియాలో వస్తున్న కథనాలతో ఈసీకి ఫిర్యాదు చేయబోతోంది. వాటిపై ఈసీ విచారణకు ఆదేశిస్తుంది. ఎక్కువ అక్రమాలు జరిగితే.. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులనూ రంగంలోకి దించే అవకాశం ఉంది. అప్పుడు కేవలం సస్పెన్షన్లతో కాదు.. నేరుగా కేసులు, అరెస్టుల వరకూ వెళ్లే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా అక్రమాలు చాలా తీవ్రమైన నేరంగా భావిస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా రాజకీయ నేతలు దొరకరు. అధికారులే బలి పశువులు అవుతారు.
ఇక మార్గదర్శి అంశంలో తప్పుడు కేసులు పెట్టేందుకు సీఐడీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు నవ్వుల పాలవుతున్నాయి. కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో సహా అన్ని పనులూ చేస్తున్నారు. ఇప్పుడు వారికి బాగానే ఉంటుంది.. కానీ పాపం పండే రోజున వారు .. తాము ఈ తప్పుడు పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందా అని మథనపడతారు. కానీ వైసీపీ నేతలు సైలెంట్ గా నే ఉంటారు. ఇక ఇసుక, మద్యం స్కాముల్లో పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు… ఇష్టారాజ్యంగా భూముల కేటాయింపు కోసం తప్పుడు నివేదికలిస్తున్న అధికారులూ బలైపోతారు. ఏ ఒక్క రాజకీయ నాయుకుడు కూడా దొరకరు.
రాజకీయ నేతలు ఐదేళ్లకో సారి మారిపోతారు. కానీ అధికారులు శాశ్వతం. ఎందకంంటే వారు ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు తాత్కలిక ప్రయోజనాల కోసం.. పోస్టింగ్‌ల కోసం బరి తెగిస్తున్నారు. ఏపీలో 20 శాతం ఐఏఎస్ అధికారులు ఇలాంటి అరాచకాలకు ఓకే చెప్పి చిక్కుల్లో పడ్డారని . ఇతర ఉన్నతాధికారులకూ లెక్కే లేదని.. వీరెవర్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.