ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందని నివేదికలో పేర్కొన్నారు. వరద ఉధృతికి గేట్లు కొట్టుకువచ్చినా అవి తమవని ఎవరూ ముందుకు రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమన్నారు.
అయితే, బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు , కార్యకర్తలవని నివేదికలో పొందుపరచారు. ఇవి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రధాన అనుచరులవని గుర్తించినట్లు వెల్లడించారు.
అక్రమ ఇసుక తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రి బోట్లనే వినియోగించేవారని నివేదించారు. ఉషాద్రికి వైసీపీ కీలక నేతలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బోట్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామని, ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనక కుట్రకోణం ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఈ బోట్లను లంగర్ కు గట్టిగా కట్టకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేయడం వెనక కుట్ర ఉందని వివరించారు. ఈ నివేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద నాలుగు రోజులుగా యుద్ద ప్రాతిపాదికన గేట్ల మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దెబ్బ తిన్న మూడు గేట్ల మరమ్మతులు సోమవారం సాయంత్రానికి పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు.