ఏపీలో ఐదేళ్ల పాటు జరిగిన విచ్చలవిడి దోపిడీకి సంబంధించి పాలన చివరి రోజుల్లో మొత్తం బయటకు వస్తోంది. ఇసుక విషయంలో కేంద్రం నియమించిన కమిటీ భారీ స్కాంను గుర్తించింది. అడ్డగోలుగా తవ్వేసి దోచేశారని తేల్చింది. ఎన్జీటీకి నివేదిక ఇవ్వబోతున్నామని హైకోర్టుకు తెలిపింది. హైకోర్టుకూ ఆ నివేదిక ఇస్తామని తెలిపింది. దీంతో ఇసుక వ్యవహారంలో .. చాలా పెద్ద తలకాయలు.. ఇరుక్కోబోతున్నాయని క్లారిటీ వచ్చేస్తోంది.
ఏపీ ప్రభుత్వ ఇసుక విధానం, అమ్మకాల గురించి పుర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది … వైసీపీ మార్క్ తెలివి తేటల్ని కోర్టులో ఉపయోగించారు. అసలు రాష్ట్రంలో ఎక్కడా తవ్వకాలు జరగడం లేదని.. స్టాక్ పాయింట్లలో ఉన్న వాటిని మాత్రమే తరలిస్తున్నారని వాదించారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. స్టాక్ పాయింట్లలో ఎన్నటికీ తరగనంత స్టాక్ నిల్వ చేశారా అని ప్రశ్నించారు. దీనికి ఆయన వద్ద సమాధానం లేకపోయింది.
ఏపీలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వి అమ్ముకుంటున్నారన్నది నిజం. పర్యావరణ అనుమతుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. తమ రాజ్యం కాబట్టి తమ ఇష్టం అన్నట్లుగా తవ్వుకున్నారు. నదీ గర్భాల్లో యంత్రాలతో తవ్వకూడదు. అసలు ఎక్కడా ఇసుకను యంత్రాలతో తవ్వకూడదు. నది మధ్యలో రోడ్డు నిర్మించి మరీ తవ్వేస్తున్నారు. కలెక్టర్లు అసలు ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. తవ్వకాలు జరగని.. లేదా..తాత్కలికంగా ఆపేసిన ఇసుక రీచ్ లకు వెళ్లి ఎక్కడా తవ్వకాలు జరగడం లేదని నివేదికలు ఇస్తున్నారు. వీరి వ్యవహారం.. కేంద్రం కమిటీతోనూ వెలుగులోకి వచ్చింది.
జగన్ రెడ్డి దోపిడీకి సహకరించిన అధికారులు కూడా ఇందులో బలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దల స్థాయిలోనే దోపిడీదారులు ఉంటే.. ఇక కింది స్థాయి అధికారులు వారికి జై కొట్టాల్సిందే. జైలుకు పోవాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారింది.