ప్రైవేటు కాలేజీలు సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కేసులు పెడతారు..! కానీ ఇక నుంచి ఏపీ ప్రభుత్వమే సెలవుల్లో క్లాసులు నిర్వహించబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ఎలాగైనా అమలు చేయడానికి అధికారులకు.. విద్యార్థుల సెలవు రోజులే కనిపించాయి. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే.. ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న అందరికీ ఉద్యోగాలు రావడం లేదని.. వారికి స్కిల్స్ లేకపోవడమే కారణం అని గుర్తించారు. వెంటనే.. వారికి స్కిల్స్ కల్పించాలన్న ఉద్దేశంతో..ఏడాది పాటు కోర్సు సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు నైపుణ్యాలు పెంచి.. ఉద్యోగం వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు.
అయితే.. డిగ్రీ ఇంజినీరింగ్ కోర్సులు… ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్లుగా మార్చడానికి అవకాశం ఉండదు. యూజీసీ, ఏఐసిటీఈ వీటిని మార్చాలి. అధికారులు.. తమ ఏడాది కోర్సు పొడిగింపు నివేదికల్ని తీసుకుని.. యూజీసీ, ఏఐసిటీఈ దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు.. ఆ నివేదికల్ని నిబిడాశ్చర్యంతో చూసి.. దగ్గర పెట్టుకోండి అని చెప్పి పంపేశారు. వారుఎలాగూ పర్మిషన్ ఇచ్చేలా లేరు.. విద్యార్థులకు స్కిల్స్ పెంచకపోతే.. ముఖ్యమంత్రి హర్ట్ అవుతారు. దీంతో అధికారులు సెలవుల్లోనే విద్యార్థులకు స్కిల్స్ పెంచాలని నిర్ణయించుకున్నారు.
మూడేళ్ల డిగ్రీలో తొలి ఏడాది, రెండో ఏడాది వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు… అప్రెంటిస్ కోర్సు పెడతారు. చివరి ఏడాదిలో ఆరు నెలలు పెడతారు. మొత్తం పది నెలలు దీంతో కవర్ అయిపోతుంది. అప్పుడు కొద్దిగా.. అప్పుడు కొద్దిగా.. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తే… చివరికి అవి వారికి గుర్తుంటాయా… అంటే.. దాని గురించి ఎవరికీ క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి ఏడాది పాటు.. అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు.. అధికారులు ఇస్తున్నారు. అంతే.. వాటి పరిణామాలు ఎవరు అనుభవిస్తే.. వారికే నష్టం..నష్టం..!