యుగపురుషుని బయోపిక్ మూవీ “ఎన్టీఆర్”కు క్రిష్‌ను అధికారికంగా దర్శకునిగా ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ వైదొలిగిన తర్వాత సినిమాపై చాలా రూమర్లు వచ్చాయి. చివరికి బాలకష్ణే డైరక్ట్ చేయబోతున్నారన్న విషయం కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. మరో దర్శకుడ్ని దర్శకత్వ పర్యవేక్షణకు పెట్టుకుని సినిమాను బాలకృష్ణే డైరక్ట్ చేస్తారని చాలా మంది నమ్మారు. కానీ అనూహ్యంగా క్రిష్ తెర మీదకు వచ్చారు. ఆలస్యం అయినా సరే “ఎన్టీఆర్”ను క్లాసిక్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో బాలకృష్ణ క్రిష్‌కే బాధ్యతలు అప్పగించారు. తన వందో సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా రూపొందించిన క్రిష్‌కు… బాలకృష్ణ అద్భుతమైన అవకాశం ఇచ్చాడనుకోవచ్చు.
నిజానికి ఎన్టీఆర్ బయోపిక్కు డైరక్టర్‌గా తేజను ప్రకటించిన తర్వాత రావాల్సినంత హైప్ రాలేదు. లెజెండరీ యాక్టర్, పొలిటీషియన్ జీవిత చరిత్ర తెరెక్కించేంత సామర్థ్యం తేజకు లేదని నందమూరి అభిమానులు కూడా ఫీలయ్యారు. బయోపిక్ డైరక్టర్‌గా ఎవరు కరెక్ట్ అంటే.. అటు నందమూరి అభిమానులతో పాటు..ఇటు సినీ ఇండస్ట్రీలోని వారికి కూడా మొదటగా తోచినపేరు క్రిష్. “గౌతమీపుత్ర శాతకర్ణి ” లాంటి సినిమాను.. అతి లాఘవంగా..వేగంగా.. ఎక్కడా క్వాలిటీ మిస్ కాకుండా తీసిన ఘనత క్రిష్‌ది. అదే సందర్భంలో కథలో భావోద్వేగాలు పండించడంలో నేర్పరి. ఎన్టీఆర్ కథకు ఆయనైతే న్యాయం చేయగలరని అందరూ భావించారు. మొదట్లో కొన్ని ప్రయత్నాలు జరిగినా…మెటీరియలైజ్ కాలేదు. కానీ కొన్ని రాసి పెట్టి ఉంటే ఆగవన్నట్లు ..అది క్రిష్ వద్దకే వెళ్లింది.
క్రిష్‌ను డైరక్టర్‌గా ఎనౌన్స్ చేస్తూ… బాలకృష్ణ.. భావోద్వేగంతో ఓ లేఖ రాశారు. దానికి క్రిష్ కూడా.. సోషల్ మీడియాలో అంతే బాధ్యతాయుతంగా స్పందించారు. ఎన్టీఆర్ సినిమా ప్రకటించినప్పుడు సంగతి ఎలా ఉన్నా కానీ..”సావిత్రి” విడుదలై అనితరసాధ్యమైన విజయాన్ని చూసిన తర్వాత “ఎన్టీఆర్” టీంపై ఆటోమేటిక్‌గా ఒత్తిడి పెరిగిపోయింది. సావిత్రి జీవితంలో అన్ని కోణాలను ఆవిష్కరించడనికి దర్శకనిర్మాతలకు అవకాశం దొరికింది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మాత్రం కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిందే. ఈ పరిమితులను పాటిస్తూనే… ఎన్టీఆర్‌ను ప్రజలు మెప్పించే విధంగా తీర్చిదిద్దే నైపుణ్యం క్రిష్‌కు ఉంది. అందుకే క్రిష్ పేరు ప్రకటించగానే.. “ఎన్టీఆర్” బయోపిక్కు అనూహ్యంగా క్రేజ్ పెరిగిపోయింది.