అధికారం చేతిలో ఉందని .. తమ ఇష్టారాజ్యమన్నట్లుగా ఏపీ పాలకులు వ్యవహరిస్తున్నారు. ఓ వ్యాపార సంస్థపై ప్రభుత్వం మొత్తాన్ని రంగంలోకి దింపి.. యుద్ధం చేస్తున్న జగన్ రెడ్డి ఆ సంస్థను ఇసుమంత కూడా కదిలించలేకపోతున్నార. దీంతో ఆయన మరింత అసహనానికి గురవుతున్నారు. చట్ట విరుద్ధ దాడులకు అధికారులను పురికొల్పుతున్నారు. తాజాగా మరోసారి మార్గదర్శిలో సీఐడీ.. తో పాటు ఇతర అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని అన్ని బ్రాంచుల్లో ఇదే పని. నిజానికి గతంలో ఎన్ని సార్లు సోదాలు చేశారో లెక్క లేదు. డస్ట్ బిన్ ఉన్న చిన్న కాగితపు ముక్కను కూడా వదలకుండా సోదాలు చేశారు. ఇప్పుడు కొత్తగా సోదాలు చేసి తీసుకునేదేమీ ఉండదు. చందాదారులు, ఖాతాదారుల లిస్ట్ ను కూడా తీసుకున్నారు. పెద్ద చిట్స్ వేస్తున్న వారిని బెదిరించేందుకు కూడా వెనుకాడటం లేదు. ఏజెంట్ల వెంటా పడుతున్నారు. ఇన్ని చేస్తున్నా.. మార్గదర్శి చెక్కు చెదరకపోతూండటంతో..ఈ సారి మరో పద్దతిలో సోదాలు ప్రారంభించారు. మార్గదర్శి వ్యాపార వ్యవహారాలకు అడ్డం పడవద్దని కోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే జరిగేదేదో జరగనీ అన్నట్లుగా.. మార్గదర్శి ఖాతాదారులను, ఏజెంట్లను భయపడేలా చేయడమే లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. చివరికి అద్దెకు తీసుకున్న కార్యాలయాల బిల్డింగ్లకు ఫైర్ సేఫ్టీని కూడా పరిశీలించాలని అనుకుంటున్నారు. నిజానికి ఆ భవనానికి పైర్ సేఫ్టీ లేకపోతే మార్గదర్శికి ఏం సంబంధం ఉంటుంది ?. కానీ పిచ్చి పలు రకాలు అన్నట్లుగా ఏదో విధంగా ఆఫీసు మూసి వేయించామని సంబర పడటానికి అన్నట్లంగా చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలా అధికార దుర్వినియోగంతో ఏదో చేద్దామని ప్రయత్నించే వారికి ఎవరికీ సత్ఫలితాలు రాలేదని.. చివరికి అది తమ నెత్తి మీద తాము చెయ్యి పెట్టుకోవడం అన్నట్లేనని.. అనేక సార్లు రుజువు అయింది. మరోసారి అదే రుజువు అవుతుందని..మార్గదర్శికి ఊడేదేం ఉండదు కానీ.. జగన్ రెడ్డి మాత్రం ఇంత అధికారంలో ఉన్నా.. ఎంత చేసినా రామోజీరావు ఏమీ చేయలేకపోయారని అందరి ముందు ఓడిపోయినట్లుగా నిలబడతారన్న వాదన వినిపిస్తోంది.