తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టింది. కానీ హైడ్రా చర్యలతో ఆ ప్రక్రియపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల కారణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై అధికారులు నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కూడా ఈ దిశగా ముందుకెళ్లాలని ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు.
బీఆర్ఎస్ హయాంలోనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభించారు. ఇందు కోసం 25.70 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకూ కేవలం 65 వేల దరఖాస్తుల్ని ఆమోదించారు. అర్హత లేని దాదాపు 3 లక్షల అప్లికేషన్లను అధికారులు తిరస్కరించారు. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో మరికొన్ని దరఖాస్తులు తిరస్కరించారు. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించి.. అవి చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ లో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలని నిర్మయించారు. అందుకే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతోంది.
భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. చిన్న చిన్న కారణాలతోనూ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను రిజెక్ట్ చేసేందుకు అధికారులు వెనుకాడటం లేదు. హైడ్రా కూల్చివేతల కారణంగా కొన్ని నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా హైడ్రా ప్రభావం, అధికారుల తీరుతో సుమారుగా 40 నుంచి 50 శాతం ఎల్ఆర్ఎస్ ధరఖాస్తులు తిరస్కరిస్తారని భావిస్తున్నారు. అయితే మొత్తం హైడ్రా … ఎక్కడెక్కడ అక్రమం అని ప్రకటిస్తుందో అక్కడ మాత్రమే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.