రెండు రాజకీయ పార్టీల మధ్య పోరాటంలో అధికారుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. వారు కూడా రాజకీయ పోరాటంలోకి వస్తున్నారు. ఈ విచిత్రాలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్ నుంచి అధికారులు బాయ్ కాట్ చేశారు. అయితే విపక్షం బాయ్ కాట్ చేయాలి కానీ అధికారులు బాయ్ కాట్ చేయడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ చేశారు. ఎందుకంటే.. వారి మనోభావాలు దెబ్బతిన్నాయట.
గ్రేటర్ లో మూడు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని.. జల మండలి అధికారుల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు ఆందోళన చేశారు. ఇది అధికారులకు కోపం తెప్పించింది. బీజేపీ కార్పొరేటర్లు ఇలా అంటారా అని వారు బీఆర్ఎస్ కార్పొరేటర్ల తరహాలో ఆందోళనలు ప్రారంభించారు. అసలు మీకేం పని … అని సర్దిచెప్పాల్సిన మేయర్ గద్వాల విజయలక్ష్మి.. వాళ్లకు మద్దతన్నట్లుగా అధికారులు బాయ్ కాట్ చేశారు కాబట్టి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇదే పద్దతి ఫాలో అయితే ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలన్నీ.. ఇలాగే అయిపోతాయి. అధికారులు ప్రభుత్వాధినేతల మెప్పు కోసం ఏం చేయాలనుకుంటే అది చేసే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడితే.. తమ మనోభావాలను విపక్షాలు దెబ్బతీశాయని వారు పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలను కూడా బాయ్ కాట్ చేస్తే.. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం వచ్చినట్లే అనుకోవచ్చు. మొత్తంగా గ్రేటర్ కౌన్సిల్ సమావేశాలు చరిత్ర సృష్టిస్తున్నాయన్న జోకులు మాత్రం వినిపిస్తున్నాయి.