గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడి నిండా నాలుగు రోజులు కూడా కాలేదు. అప్పుడే తెరాస సర్కారు నగర పేదలమీద కత్తి దూస్తున్నట్లుగా కనిపిస్తోంది. నగరంలోని పేదలందరికీ కూడా ఏడాదికి లక్ష వంతున టూబెడ్రూం ఇళ్లు కటిస్తానంటూ ఎన్నికల సమయంలో భారీ ఎత్తున హామీలు గుప్పించి తిరుగులేని ప్రజాదరణను సొంతం చేసుకున్న తెరాస పార్టీ.. ఎన్నికలు ముగిసిన వెంటనే.. పేదల గుడిసెల కూల్చివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో జూబ్లీహిల్స్లో అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి వెనుకవైపున ఎంతో కాలంనుంచి ఉన్న పేదల గుడిసెలను మంగళవారం నాడు ఉదయం అధికారులు హఠాత్తుగా కూల్చివేయడం ప్రారంభించారు.
పేదలందరికీ టూబెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తాం అనేది ప్రభుత్వ ప్రధాన నినాదం. రాష్ట్రవ్యాప్తంగా కూడా పేదలందరినీ ఈ నినాదం బీభత్సంగా ఆకర్షిస్తున్నదనడంలో సందేహం లేదు. అయితే జూబ్లీహిల్స్లో ఎంతోకాలంనుంచి ఉన్న పేదల గుడిసెలను ఎన్నికలు పూర్తయిన నాలుగోరోజునే కూల్చేయడం అనేది విమర్శలకు తావిస్తోంది. తాము నిర్మించుకున్న గుడిసెలను సర్కారు ఇలా ఉన్నపళంగా కూల్చేయం దారుణం అంటూ స్థానికులు, పేదలు ఆందోళనలు చేస్తున్నారు.