బెంగాల్ చీఫ్ సెక్రటరీగా నిన్నటి వరకూ ఉన్న ఆలాపన బందోపాధ్యాయ ఇప్పుడు ..అటు కేంద్రం.. ఇటు బెంగాల్ సర్కార్ మధ్య ఇరుక్కుపోయారు. పొలిటికల్ టగ్ ఆఫ్ వార్లో బలి పశువుగా మారే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అన్న పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విజయం సాధించినప్పటికీ… బీజేపీ .. ప్లాన్ బీ అమలు చేస్తోంది. అందులో భాగంగా… మమతా బెనర్జీకి క్షణం తీరిక లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో… చాలా వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఓ వైపు గవర్నర్ దూకుడు చూపిస్తున్నారు. మరో వైపు ప్రధాని మోడీ వైపు నుంచీ ఎటాక్ జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులపై అస్త్రాలు ఎక్కుపెట్టడం కలకలం రేపుతోంది.
తుపాను ప్రాంతాలను పరిశీలించడానికి మోడీ వెళ్లినప్పుడు మమతా బెనర్జీ అరగంట ఆలస్యంగా వెళ్లారు. ఆ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అలాపన బందోపాధ్యాయ కూడా ప్రధానితో భేటీకి రాలేదు. సీఎం బెనర్జీ రాకపోయినా సీఎస్ రావాల్సిందేనని ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో కేంద్రానికి కోపం వచ్చింది. ఏకపక్షంగా ఆయనను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ.. డీవోపీటీ నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. నిజానికి ఆయన పదవి కాలం ముగిసింది. కానీ మూడు నెలల పొడిగింపు ఇచ్చారు. కేంద్రానికి బందోపాధ్యాయను పంపడం ఇష్టం లేని మమతా బెనర్జీ… ఆయనకు పొడిగింపు ఇవ్వకుండా రిటైర్ చేయించారు. వెంటనే… ఆయనను తన సలహాదారుగా నియమించుకున్నారు.
ఇప్పుడు.. తమ మాట వినని బందోపాధ్యాయపై కేంద్రానికి పీకల మీద దాకా కోపం వచ్చింది. ఆయనపై విపత్తు చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల తర్వాత ఆయనపై కఠినమైన చర్యలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే… ప్రస్తుతం.. మమతా బెనర్జీని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అలాపన బందోపాధ్యాయపై చర్యలు తీసుకుంటే.. మమతా బెనర్జీ ఆదేశాలను ఇతర అధికారులు పాటించరని.. కేంద్రం చెప్పినట్లుగా చేస్తారని నమ్ముతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో అటు బీజేపీ.. ఇటు మమతా బెనర్జీ మధ్యలో అధికారులు ఇరుక్కుపోయారు.
సివిల్ సర్వీస్ అధికారులు పెద్ద ఎత్తున అధికార పార్టీల వారికి ఊడిగం చేస్తున్నారు. కీలకమైన పోస్టుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. దీని వల్ల వారు అలుసైపోతున్నారు. రాజకీయ అధికారం ఉన్న వారి చేతుల్లో పావులుగా మారుతున్నారు. కొంత మంది జైలుకెళ్లే పరిస్థితి వచ్చినా ఇతర అధికారులకు బుద్ది రావడం లేదు. ఫలితంగా.. రాజకీయ నేతలు.. తమ కక్ష సాధింపు రాజకీయాల కోసం… సివిల్ సర్వీస్ అధికారుల్నే పావులుగా వాడుకుంటున్నారు.