జగన్ ప్రతీకారం తీర్చుకునేందుకు… అడ్డగోలుగా కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరించి వ్యవహరిస్తున్న అధికారులు .. ఇప్పుడు న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. సీఐడీ చీఫ్ సంజయ్ సహా మొత్తం నలుగురు సీఐడీ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే వ్యక్తిగత కారణాలు చెప్పి ఇద్దరు హాజరు కాలేదు. మరో ఇద్దరు హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా.. మార్గదర్శి ఎండీ శైలజపై లుకౌట్ నోటీసు ఎందుకు జారీ చేశారని వారిని కోర్టు ప్రశ్ని స్తే సమాధానం లేదు.
అదే సమయంలో కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ప్రతీ సందర్భంలోనూ జరుగుతోంది. మార్గదర్శి ఆఫీసులు ఉండే ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లాంటి కార్యాలయాల్లో.. రోజుల తరబడి సోదాలు చేస్తున్నారు. ఈ పేరుతో ఖాతాదారులను అడ్డుకుంటున్నారు. చిట్స్ వేసే వారిని బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. మార్గదర్శి విషయంలో ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది కదా అని చట్ట విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. అన్నింటికీ ఇవాళ కాకపోతే రేపైనా అధికారులు కోర్టు ముందు నిలబడక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
కొత్తగా మార్గదర్శి ఆపరేషన్ కు నియమితులైన సీతారామాంజనేయులుకు.. పెద్ద టాస్క్ గా మారింది. ఇప్పటికే.. మార్గదర్శి విషయం క్లిష్టంగా మారింది. తప్పులు పట్టుకోలేకపోతున్నారు. లేని తప్పుల్ని చూపించి.. ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కానీ ఏపీలో మరో చిట్ ఫండ్ కంపెనీ జోలికి వెళ్లడం లేదు. రేపు ఈ సంస్థపై అమలు చేసిన కఠిన నిబంధనలు ఇతర సంస్థల విషయంలో ఎందుకు పట్టించుకోలేదు.. ఒక్క మార్గదర్శినే ఎందుకు టార్గెట్ అనే ప్రశ్న వేస్తే.. ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
పక్కాగా కోర్టు ధిక్కరణలు.. అధికార దుర్వినియోగం కనిపిస్తూండటంతో… అధికారులు ఇవాళ కాకపోతే రేపైనా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదన్న వాదన న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. మరో వైపు జగన్ ను నమ్ముకుని అవినీతి చేసి కాదు.. ఇలా కూడా జైలుకెళ్లాలా అని అధికారులు మధనపడుతున్నారు.