వయసు కొవ్వొత్తి లాంటిది. అది కరిగిపోతూనే ఉంటుంది. కానీ ఓ ముసలమ్మకు మాత్రం ఎగిరిపోయిన సీతాకోకచిలుక మళ్లీ వచ్చి చేతుల్లో వాలినట్టు… వయసు తిరిగొచ్చేసింది. తనని 23 ఏళ్ల పడుచమ్మాయిగా మార్చేసింది. ఎన్ని పూజలు చేసిందో, మాయే జరిగిందో – ‘దేవుడు మళ్లీ వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలు విప్పుకొంది’. మరి ఆ తరవాతేంజరిగిందో… `ఓ బేబీ` సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ`కి రీమేక్ ఇది. సమంత కథానాయిక. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. వచ్చే నెల 5న విడుదల అవుతోంది.
కాస్త ఫాంటసీ, కాస్త డ్రామా, ఇంకాస్త ఎమోషన్, అన్నిటికంటే మించి వినోదం మేళవించిన సినిమా ఇది. ట్రైలర్లో అన్నిరకాల భావోద్వేగాలూ కనిపిస్తున్నాయి. సినిమా అంతా సమంత పాత్ర చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. సమంతలోని బామ్మని గుర్తుపట్టని మనవడు కూడా ఆమెకు లైన్ వేయాలనుకోవడం, రాజేంద్రప్రసాద్ సమంతలా కుర్రాడైపోవాలని ఆరాట పడడం, సమంత చేసే అల్లరి – ఇవన్నీ బాగా వర్కవుట్ అయ్యేట్టు అనిపిస్తున్నాయి. తమాషా లైన్ ఇది. వినోదం ఎంత కావాలిస్తే అంత పిండుకోవొచ్చు. ఆ వినోదంతో పాటు, ఎమోషన్ కూడా వర్కవుట్ అయితే…. ఓ బేబీ హిట్టయిపోయినట్టే.