హైదరాబాద్: సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ రాజమౌళితో చేతులు కలిపి బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు మణిరత్నంతో చేతులు కలిపారు. మణిరత్నం ఇటీవల తమిళం, తెలుగు భాషలలో తీసిన ఓకే బంగారం(ఓ కాదల్ కన్మణి) చిత్రాన్ని ధర్మా మూవీస్ బ్యానర్‌పై కరణ్ జోహార్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. మణిరత్నంకు గతంలో అససియేట్గా పనిచేసిన షాద్ అలీ దర్శకత్వం వహిస్తారు. ఈయన గతంలో మణిరత్నం చిత్రం ‘సఖి’ని కూడా హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మణిరత్నం అందించిన చిత్రాన్ని షాద్ అలీ దర్శకత్వంలో ధర్మా మూవీస్ బ్యానర్‌పై తిరిగి సృష్టించటానికి ఆయనతో కలిసిపనిచేయటాన్ని గౌరవంగా భావిస్తున్నానంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. ఓకే బంగారంలో దుల్కర్, నిత్యామీనన్ పోషించిన పాత్రలలో ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం, గుల్జార్ సాహిత్యం అందిస్తారు. ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్ పాత్రలకు నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది.