వెండితెరపై ప్రేమకథలు చెప్పాలంటే మణిరత్నం తర్వాతే ఎవరైనా. ఆయన సినిమా ఓ పెయింటింగ్ లా వుటుంది. ప్రేమ కధలు తీయాలనే దర్శకులకు మణిరత్నం సినిమాలే రిఫరెన్స్. చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది ఒక లవ్‌స్టోరీ తీశారాయన. అదే ‘ఓ కాదల్ కన్మణి’. తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో విడుదల చేశారు. ఈతరం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే లవ్‌స్టోరీ ఇది. యువతరంఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు, భావోద్వేగాలకి తగ్గట్టు ఈ చిత్రాన్ని మలిచారు. ఈ సినిమా యువతరానికే కాదు సినిమాను ఇష్టపడే వారందరికి నచ్చేసింది. ప్రేమ కధను డీల్ చేయడంలో తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నారు మణిరత్నం ఓకే బంగారంతో.
ఈ సినిమా బాలీవుడ్ కి వెళ్ళింది. ‘ఓకే జాను’ పేరుతో అక్కడ రీమేక్ చేశారు. శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ బంగారం అక్కడ ఇత్తడైపోయింది. ప్రేక్షకులను అలరించలేకపోయింది ‘ఓకే జాను’ మొదటి వారం ఈ సినిమా కలెక్షన్స్ పదిహేను కోట్లకు కూడా దాటలేదు. ట్రేడ్ పండితులు చిత్రాన్ని ఫ్లాప్ ఫోల్డర్ లో చేర్చేశారు.
ఈ సినిమాకి పెద్ద సెటప్ నే వాడారు. మణిరత్నం ఓ నిర్మాతగా వున్నారు. రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇదీ పాపులర్ అయ్యింది. హమ్మహమ్మ సాంగ్ ను రీమిక్స్ చేశారు. యుట్యూబ్ లో సూపర్ హిట్. టాప్ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఈ చిత్రానికి కెమరా హ్యాండిల్ చేశారు. ఆషికి తో స్వీట్ లవ్ కపుల్ అనిపించుకున్న శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ లను జోడిగా తీసుకున్నారు. ఓకే బంగారం కంటే మించిన రొమాంటిక్ సన్నీవేషాలను తీశారు. అయితే ఇవేవీ సినిమాని కాపాడలేకపోయాయి. ఓకే బంగారంలో వున్న ఫీల్ క్యారీ కాలేదు. ఒక్క ఫ్రేములో కూడా బంగారం మ్యాజిక్ కనిపించలేదు. సినిమాలోని ఆత్మను పట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు రీమేక్ దర్శకుడు సాద్ అలీ. మొత్తంమ్మీద సౌత్ లో మెరిసిన మణిరత్నం బంగారం అక్కడ ఇత్తడైపోయింది.