దర్శకుడు విజయ్ కుమార్ కొండాకి ఓ చేదు అనుభం ఎదురైంది. ఓ మహిళ ఆయనపై దాడి చేసింది. చెప్పుతో కొట్టింది. అదీ.. పోలీసుల సాక్షిగా. అసలేం జరిగింది??
గుండెజారి గల్లంతయ్యిందే లాంటి హిట్‌తో టాలీవుడ్‌లో పేరు తెచ్చుకొన్నాడు విజయ్ కుమార్ కొండా. ఆ తరవాత నాగచైతన్యతో ఒకలైలా కోసం సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో విజయ్ కెరీర్ స్లో అయిపోయింది. గత కొంతకాలంగా ప్రసూన అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు విజయ్ కుమార్. వీరిద్దరికీ రీసెంట్‌గా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి కూడా జరిగిందట. అయితే మా అమ్మాయిని మాయ మాటలు చెప్పి లోబరచుకొన్నాడు.. అంటూ ప్రసూన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘ఇద్దరం ఇష్టప్రకారమే పెళ్లి చేసుకొన్నాం..’ అని చెప్పడానికి తన భార్యతో సహా.. ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు విజయ్ కుమార్ కొండా. అయితే అక్కడే కాపు కాచుకొని కూర్చున్న ప్రసూన తల్లిదండ్రులు, బంధువులు విజయ్ కుమార్‌పై దాడి చేయడానికి ప్రయత్నించారు. ప్రసూన తల్లి చెప్పుతో దాడి చేసింది. దాంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికప్పుడు హుటాహుటీన కారులో వెళ్లిపోయాడు విజయ్ కుమార్ కొండా. విజయ్‌కుమార్ పచ్చి మోసగాడని, తన కూతురికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకొన్నాడని, ఈ పెళ్లి చెల్లదని ఆరోపిస్తున్నారు ప్రసూన బంధువులు.