‘2.ఓ’… ‘రోబో’కి సీక్వెల్! రేపు (గురువారం) విడుదలవుతోందీ సినిమా. దర్శకుడు శంకర్ ఈసారి ఏం మేజిక్ చేసుంటాడోనని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే తన తదుపరి సినిమాను ఎప్పుడో ప్రకటించాడు శంకర్. కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చేయడానికి కథ సిద్ధం చేసుకున్నారు. ‘2.ఓ’ విడుదలైన ఐదారు రోజుల తరవాత ఆ సినిమాపై దృష్టి పెడతానని తాజా ఇంటర్వ్యూలో శంకర్ తెలిపారు. విచిత్రం ఏంటంటే… బ్యాక్ టు బ్యాక్ శంకర్ సీక్వెల్స్ తీస్తుండటం! ‘రోబో’కి ‘2.ఓ’ సీక్వెల్ అయితే, ‘భారతీయుడు’ చిత్రానికి ‘భారతీయుడు 2’ సీక్వెల్. ఈ రెండే కాదు… రెండిటి తరవాత కూడా ఆయన సీక్వెల్ చేసే అవకాశాలు ఎక్కువ వున్నాయి. ప్రస్తుతం ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ కథ కోసం ఆలోచిస్తున్నానని శంకర్ తెలిపారు. “నేను తీసిన 12 సినిమాలకూ సీక్వెల్స్ తీయవచ్చు. అయితే… సీక్వెల్ చేసే అవకాశం వుందని చేయకూడదు. సరైన కథ కుదిరినప్పుడు సీక్వెల్ చేయాలి. సరైన కథ కుదిరింది కాబట్టే ‘2.ఓ’ తీశా. ‘భారతీయుడు 2’ మొదలుపెట్టా. ఇప్పుడు ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ కథ కోసం ఆలోచిస్తున్నా” అని శంకర్ పేర్కొన్నారు.