హైదరాబాద్: పెద్ద నగరాలు, మెట్రో నగరాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్యాక్సీ సర్వీసులు అందజేస్తున్న ఓలా, ఉబర్ సంస్థలు తమకు పెనుముప్పుగా మారాయని కార్లు తయారుచేసే ఆటోమొబైల్ కంపెనీలు విలవిలలాడుతున్నాయి. ఈ సర్వీసులు వచ్చిన తర్వాత సొంతంగా వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని సాక్షాత్తూ ‘మహీంద్ర’ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించారు. అయినా సొంతంగా వాహనం ఉండాలనే ఆకాంక్ష, వ్యామోహం గలవారు కూడా ఉన్నారని, అలాంటివారి కోసమే తాము వాహనాలు డిజైన్ చేయాల్సి వస్తున్నదని చెప్పారు. రేడియో టాక్సీ కంపెనీలు పోటీపడుతూ అద్దె ధరలను తగ్గిస్తుండటం, కిలోమీటర్లనుబట్టి ఛార్జీలు ఉండటం, నిర్వహణవంటి సమస్యలు లేకపోవటంతో ప్రజలు అద్దెకార్లవైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. లక్షలు వెచ్చించి కారును కొనటంబదులు అవసరాన్నిబట్టి అద్దెకు తీసుకోవటమే ఉత్తమమనే భావన ప్రజల్లోకి చొచ్చుకుపోయిందని చెప్పారు. తాము తాజాగా విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్యూవీ ‘టీయూవీ 300’ అలాంటిదేనని తెలిపారు. ఒక యుద్ధ ట్యాంక్ నమూనాలో దీనిని డిజైన్ చేశామని, దీనిని అభివృద్ధి చేయటానికి రు.1,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. టీయూవీ 300 వాహనానికి మూడు సంవత్సరాలు, లక్ష కిలోమీటర్ల వారెంటీ ఇస్తున్నామని వెల్లడించారు.
నిజంగానే ఓలా, ఉబర్ రేడియో టాక్సీ సర్వీసులు వచ్చిన తర్వాత ట్యాక్సీ ప్రయాణం మరింత చౌకగా, తేలికగా మారిందనటంలో సందేహంలేదు. కాల్ చేయగానే వీరి వాహనాలు వచ్చి ముందు వాలుతున్నాయి. మినిమమ్ ఫేర్కూడా తక్కువ ఉంటోంది. మామూలుగా చిన్న దూరాలకు సాధారణ ట్యాక్సీలవారు రారు. అయితే ఓలా, ఉబర్ సర్వీసులలోమాత్రం అలాంటి పట్టింపేమీ ఉండకపోవటంవలనే అవి అంత బాగా క్లిక్ అయ్యాయి. దానికి తోడు వీరి యాప్ వలన వీటి సేవలు పొందటం మరింత సులభంగా ఉంది. అందుకే ‘మహీంద్ర’ వంటి బడా ఆటోమొబైల్ సంస్థలుకూడా వీటి పేరు చెబితే వణుకుతున్నాయి. కాకపోతే ఈ ట్యాక్సీల డ్రైవర్లు స్త్రీ ప్రయాణీకులపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తుండటంతో ఒంటరి మహిళలకుమాత్రం ఇవి సురక్షితం కాదనే అభిప్రాయం నెలకొనిఉంది.