సుదీర్ఘ విరామం తర్వాత టిఆర్ఎస్ మళ్లీ ఓటుకు నోటు పల్లవి వినిపించింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సన్‌బర్న్ ఈవెంట్‌కు సంబంధించి మంత్రి కెటిఆర్‌పై చేసిన ఆరోపణలను ఖండించేందుకోసం శాసనమండలి విప్, కెసిఆర్ సన్నిహితుడు పల్లా రాజేశ్వరరెడ్డి నోట ఈ మాటలొచ్చాయి. రేవంత్ రెడ్డి,చంద్రబాబు ఈ కేసునుంచి తప్పించుకోలేరని ఆయన అన్నారు. వారు జైలుకు పోక తప్పదని కూడా అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మొత్తంపైన టిఆర్ఎస్ నేతలు ఈ సమస్యను ముందుకు తేవడం రాజకీయంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇరుకునపెట్టడం అనివార్యం. ఆయన జైలుకు వెళతారని కూడా అంటే మరింత తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఇంత ముఖ్యమైన కేసులో కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు ఉపేక్ష వహిస్తున్నదో తెలియదు. ఇప్పుడు కూడా రాజకీయ వాదనకోసం ప్రస్తావించడం తప్ప ఏదో జరిగిపోతుందనుకుంటే పొరబాటే. అయితే రాజేశ్వరరెడ్డి ప్రధాన బాణాలు రేవంత్ రెడ్డిపైనే సంధించారు. ప్రధానంగా ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం నాటకమనీ, తెలంగాణ స్పీకర్‌కు గాక ఎపి ముఖ్యమంత్రికి ఇస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. భద్రతా సిబ్బందిని వెనక్కు పంపడం కూడా ప్రచారానికి తప్ప ప్రయోజనంలేని వ్యవహారమని, రాజీనామా చేస్తే వారంతా ఉపసంహరించబడతారని వ్యాఖ్యానించారు. ఇంకో వైపున రేవంత్ తాను డిసెంబర్ 9 నుంచి క్రియాశీలంగా జనంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. రాజీనామాపై మాత్రం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కొడంగల్‌లో ఆయనను ఓడించేందుకు మంత్రి హరీశ్‌రావుకు బాధ్యత అప్పగించడం, టిదిపి దిగువ స్థాయి నేతలను టిఆర్ఎస్ ఆకర్షించడం నేపథ్యంలో అప్పుడే ఉప ఎన్నికకు వెళ్లడం మంచిది కాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. రేవంత్ కోసం చిక్కులు కొనితెచ్చుకోవద్దని వారు అనుకుంటున్నారట.ఎందుకంటే ఈ సమయంలో ఓడిపోతే రేపటి శాసనసభ ఫలితాలకు అది సంకేతం ఇచ్చినట్టవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.ఇదంతా తెలుసు గనకే టిఆర్ఎస్ నాయకులు రాజీనామా చేసేయమంటూ రేవంత్‌ను సవాళ్లతో ఉడికిస్తున్నారు. ఓటుకు నోటు కూడా పైకి తెస్తున్నారు.