తెలుగు చిత్రసీమలో ఓ విచిత్రమైన ట్రెండ్ నడుస్తుంటుంది. ఓ తమిళ హీరో సినిమా డబ్ అయి.. తెలుగులో హిట్ కొడితే.. అక్కడ్నుంచి ఆ హీరోని రకరకాలుగా పిండేస్తుంటారు ఇక్కడి నిర్మాతలు. సదరు హీరో పాత సినిమాల్ని కూడా టోకుగా కొనేసి, వాటిని డబ్ చేసేసి… అదేదో కొత్త సినిమాలుగా బురిడీ కొట్టించి, తెలుగులో రిలీజ్ చేస్తుంటారు. ఇది వరకు రానా, సూర్య, ధనుష్ సినిమాలు కొన్ని ఇలానే విడుదలయ్యేవి. ఇప్పుడు ఈ ట్రెండ్ రివర్స్ అయ్యింది. మన హీరోల పాత సినిమాల్ని తమిళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. మహేష్‌బాబు, ప్రభాస్ సినిమాలకు అక్కడ విచ్చలవిడిగా గిరాకీ ఏర్పడింది. అది ఎంత వరకూ వెళ్లిందంటే మహేష్ బాబు తొలి చిత్రం రాజకుమారుడుని పద్దెనిమిదేళ్ల తరవాత తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. తుని చల్కారన్ పేరుతో.
అతడు నుంచి మహేష్ సినిమాలు తమిళంలో డబ్ అవ్వడం మొదలయ్యాయి. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం అక్కడ భారీ స్థాయిలో విడుదలయ్యాయి. ఇప్పుడు మహేష్ తన కెరీర్లో తొలిసారి ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాడు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు చోట్లా ఒకేసారి విడుదల కాబోతోంది. మురుగదాస్ తమిళనాట టాప్ మోస్ట్ డైరెక్టర్. కాబట్టి ఆ సినిమాపై ఫోకస్ పెరిగింది. ఇప్పుడు తమిళ నాట మహేష్ గురించీ అతని గత సినిమాల గురించీ మాట్లాడుకొంటున్నారు. ఇదే అదనుగా తీసుకొన్న అక్కడి నిర్మాతలు మహేష్ పాత సినిమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రాజకుమారుడు తమిళ వెర్షన్‌ని ఈ శుక్రవారం విడుదల చేశారు. మరీ పాత సినిమా కావడం, ప్రచారం భారీ ఎత్తున లేకపోడంతో ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రభాస్‌కీ అక్కడ భారీ డిమాండ్ ఉంది. బాహుబలి తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ప్రభాస్ పాత సినిమాలకు గిరాకీ పెరిగింది. బుజ్జిగాడు, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు త్వరలో తమిళంలో విడుదల కానున్నాయి.