“ఒలెక్ట్రా ఈ బస్” కంపెనీ తెర మీదకు వచ్చేసింది. విజయవాడ ఆర్టీసీ బస్ భవన్లో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యక్షమయ్యారు. 350 ఎలక్ట్రిక్ బస్సులకు అద్దె ప్రాతిపదికన టెండర్ల కోసం ప్రిబిడ్ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన ఎలక్ట్రిక్ బస్ కాంట్రాక్టును మేఘా ఇంజినీరింగ్ కంపెనీ గ్రూప్‌నకు చెందిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ కంపెనీ ఇచ్చేందుకు ముందస్తుగా ఒప్పందం కుదిరిందని కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రిబిడ్ సమావేశానికి ఆ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా కంపెనీల నుంచి సాంకేతిక నిపుణులను కూడా తీసుకు వచ్చారు. వలెన్ ఫ్రా, టాటా టెల్కో, అశోక్ లేలాండ్, ఐషర్ తో పాటు మరో నాలుగు కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చారు. అందరూ.. తమ తమ ప్రతిపాదనలను
పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఇచ్చారు.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు ఇస్తున్నారు. 12 ఏళ్ల కాలపరిమితికి టెండర్లను ఆహ్వానించారు. రన్నింగ్ కిలోమీటర్లకు చెల్లింపులు చేసేలా ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోబోతున్నారు. అక్టోబర్ 14లోగా టెక్నికల్ బిడ్లు, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. నవంబర్ 6న రివర్స్ బిడ్డింగ్‌కు ఆర్టీసీ వెళ్తుంది. అయితే.. ఇదంతా.. రొటీన్ ప్రక్రియ అని… ఏపీ సర్కార్ రివర్స్ టెండర్లు అంటే.. పోలవరం ప్రాజెక్ట్ పనులను.. మేఘా ఇంజినీరింగ్ కు కట్టబెట్టినట్లే ఉంటుందన్న విమర్శలు ముందు నుంచీ వస్తున్నాయి. పోలవరం హెడ్ వర్క్స్, విద్యుత్ కేంద్రం పనులను నష్టాలకు చేసేందుకు అంగీకరించినందుకు.. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం కుదిరిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
దానికి తగ్గట్లుగానే అలా.. పోలవరం ప్రాజెక్ట్ బిడ్ ముగియగానే.. ఇలా.. ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్‌ను ఇచ్చేందుకు బిడ్లు పిలిచారు. తెలంగాణలో కిలోమీటర్ కు రూ. 36 చోట్ల ఇస్తూంటే.. ఏపీలో మాత్రం రూ. 60 డిమాండ్ చేస్తున్నారని… ఆ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు ఇది క్విడ్ ప్రో కో అనే ఆరోపణలు ప్రారంభించారు కూడా. ఈ వేడి ఇలా కొనసాగుతూండనేగా.. ఒలెక్ట్రా.. బ్రిబిడ్డింగ్ లో పాల్గొంది. ఇక అసలు రివర్స్ బిడ్డింగ్‌లో కాంట్రాక్ట్ దక్కించుకోవడమే మిగిలింది.